Mass Maharaja: రవితేజ, కిశోర్ తిరుమల కాంబోలో మూవీ...
ABN, Publish Date - May 07 , 2025 | 02:34 PM
మాస్ మహరాజా రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం 'మాస్ జాతర' మూవీ చేస్తున్న రవితేజ... దీని తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
మాస్ మహరాజా రవితేజ (Raviteja) ... రెండేళ్ళ క్రితంతో పోల్చితే ఈ మధ్య జోరు తగ్గించాడు. దానికి కారణం గత యేడాది సరైన హిట్స్ లేకపోవడమే. లాస్ట్ ఇయర్ రవితేజ నటించిన 'ఈగిల్' (Eagle) , 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో మరోసారి ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టాడు. ప్రస్తుతం రవితేజ 75వ సినిమాగా 'మాస్ జాతర' (Mass Jathara) ను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే మూవీ విడుదల కావాల్సి ఉన్నా... షూటింగ్ సమయంలో రవితేజ చేతికి గాయం కావడంతో షూటింగ్ వాయిదా పడింది. అది సినిమా విడుదలపై ప్రభావం చూపింది. ఇదిలా ఉంటే... అతి త్వరలోనే రవితేజ మరోసినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నట్టు సమాచారం.
'సెకండ్ హ్యాడ్' (Secound Hand) మూవీతో దర్శకుడిగా మారిన రచయిత కిశోర్ తిరుమలతో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. కిశోర్ తిరుమల ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ను బాగా తెరకెక్కిస్తాడు. సున్నితమైన హాస్యంతో పాటు చక్కని వినోదానికి తన చిత్రాలలో పెద్ద పీట వేస్తాడు. బేసికల్ గా రైటర్ కూడా అవడంతో ఆర్టిస్టుల నుండి తనకు కావాల్సిన హావభావాలను మంచి టైమింగ్ తో రాబట్టుకుంటూ ఉంటాడు. దర్శకుడిగా 'సెకండ్ హ్యాండ్' అతన్ని నిరాశకు గురిచేసినా... ఆ తర్వాత అతను డైరెక్ట్ చేసిన 'నేనూ శైలజ' మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సంవత్సరమే రామ్ తో 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ చేశాడు. ఇదేమంత ఆడలేదు. ఆపైన సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందించిన 'చిత్రలహరి' (Chitralahari) చక్కని విజయాన్ని అందుకుంది. రామ్ తోనే చేసిన 'రెడ్' (Red) ఫర్వాలేదనిపించినా... శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల రూపొందించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' తిరిగి నిరాశకు గురిచేసింది. అయితే... కిశోర్ పై ఉన్న నమ్మకంతో రవితేజ అతని స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ నయా కాంబినేషన్ లో మూవీ జూన్ 3న మొదలవుతుందని, ఫిబ్రవిలో విడుదల అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం 'మాస్ జాతర'కు సంగీతం అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో నే కిశోర్ తిరుమల సినిమాకూ సంగీతం అందించబోతున్నాడట. మరి రవితేజ, కిశోర్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: Devendra Fadnavis: త్వరలో అహల్యాబాయి బయోపిక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి