Child Artist Ravi Rathod: తాగుబోతులకు సహాయం చేయనని రాఘవ లారెన్స్ తిట్టాడు..
ABN, Publish Date - Jul 14 , 2025 | 02:13 PM
ప్రపంచంలో అందరి జీవితాలు ఒకలా ఉండవు. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్స్ గా బతికినవారు కూడా చివరి రోజుల్లో అడుక్కునే పరిస్థితి చవిచూశారు.
Child Artist Ravi Rathod: ప్రపంచంలో అందరి జీవితాలు ఒకలా ఉండవు. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్స్ గా బతికినవారు కూడా చివరి రోజుల్లో అడుక్కునే పరిస్థితి చవిచూశారు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. బాలనటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఒక కుర్రాడు.. ఇప్పుడు మందుకు బానిసగా మారి.. ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతడు ఎవరో కాదు రవి రాథోడ్ (Ravi Rathod). ఒకప్పుడు ఈ పేరు ఎవరికి తెలియదు. ఒక ఇంటర్వ్యూ అతడి జీవితాన్ని మార్చేసింది. విక్రమార్కుడు సినిమాలో రేయ్ సత్తి బాలు ఇటు వచ్చిందా అని క్యూట్ గా అడిగి రవితేజ చేతిలో దెబ్బలు తిన్న బాలనటుడు గుర్తున్నాడా..? అతడే రవి రాథోడ్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన రవి.. అన్ని బావుంటే ఈపాటికే మిగతా బాలనటులులానే అయితే హీరో అయ్యేవాడు.. లేకపోతే చదువుకొని ఉద్యోగం లో స్థిరపడేవాడు. కానీ, చిన్నతనంలోనే తల్లిదండ్రుల మరణాన్ని కళ్ళారా చూడడంతో రవి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. తాగుడికి బానిసగా మారాడు. ఎవరు పట్టించుకోకపోవడంతో సెట్ లో కూలీగా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇక కొంతమంది అతడిని గుర్తుపట్టి సోషల్ మీడియాలో పెట్టడంతో అతని గురించి అందరికీ తెలిసింది.
ఒక యూట్యూబ్ ఛానెల్ రవిని ఇంటర్వ్యూ చేయడంతో నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ వద్దకు ఈ విషయం చేరింది. ఈ ఇంటర్వ్యూలో రవి.. లారెన్స్ దగ్గరకు వెళ్తే తిడతాడు, కొడతాడు అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ వీడియోపై లారెన్స్ స్పందించాడు. అతని బాధ చూసి చలించిపోయిన లారెన్స్.. నేను కొట్టను, తిట్టను.. నిన్ను ఒకసారి కలవాలి. నా దగ్గరకు రా అని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దీంతో రవి రాథోడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి రవిని చెన్నైకి తీసుకెళ్లడం, లారెన్స్, రవితో మాట్లాడి ఆర్ధిక సహాయం చేయడం కూడా జరిగింది. అయితే ఆ డబ్బుతో రవి మళ్లీ తాగుతున్నాడు అని తెలుసుకున్న సదురు యూట్యూబ్ ఛానెల్ మరోసారి అది నిజమో కాదో తెలుసుకుందాం అని అతడిని వెతుక్కుంటూ వెళ్ళింది.
ఇక ఒక ఇంట్లో రవిని కనుక్కున యాంకర్.. అసలు ఏం జరిగిందని, లారెన్స్ ఏమన్నారనీ అడిగింది. అందుకు రవి మాట్లాడుతూ.. నేను చెన్నై వెళ్ళి లారెన్స్ గారి టీమ్ ను కలిశాను. వారు నన్ను లారెన్స్ అన్న దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నాతో మాట్లాడారు. సాధారణంగా నేను తాగుబోతులకు సపోర్ట్ చేయను అని తిట్టారు. కానీ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు కాబట్టి సహాయం చేస్తున్నాను అని చెప్పారు. ఆ తరువాత ఆయన టీమ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించారు. మద్యం ముట్టుకోకుండా మందులు ఇచ్చారు. లారెన్స్ అన్న కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే నేను బతుకుతున్నాను. ఒక ఫోన్ కూడా కొన్నాను. వారం రోజుల తరువాత మళ్లీ చెన్నై రమ్మన్నారు. ప్రస్తుతం మందు మానేశాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
NTR: పేషెంట్ లా కనిపిస్తున్న తారక్.. అనారోగ్యంతో బాధపడుతున్నాడా