Rashmika Mandanna: బస్సు దుర్ఘటన.. గుండె పగిలిపోయింది..
ABN, Publish Date - Oct 25 , 2025 | 10:46 AM
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు దగ్గర్లో జరిగిన బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఎన్నో కుటుంబాల్లో ఈ దుర్ఘటన విషాదం నింపింది.
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు దగ్గర్లో జరిగిన బస్సు అగ్ని (Kurnool Bus Accident) ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఎన్నో కుటుంబాల్లో ఈ దుర్ఘటన విషాదం నింపింది. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. (V kaveri travels)
‘‘కర్నూలు బస్సు ప్రమాద వార్త విని నా గుండె ముక్కలైంది. మనసంతా తెలియని బాధ తో నిండిపోయింది. ఎంతో బాధపడ్డాను. మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణనాతీతం. కాలిపోయే ముందు వాళ్ల బాధ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇందులో చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని రష్మిక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనపై సోనూసూద్ కూడా స్పందించారు. ‘ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల్లో 2 వారాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ చూసిన ప్రమాదాలు చాలు.. ఇప్పటికైనా కఠిన నిబంధనలు అమలు చేయండి’ అని సోనూసూద్ అన్నారు.