R Narayana Murthy: యూనివర్సిటీ చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:02 PM
ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన సినిమా 'యూనివర్సిటీ'. ఈ సినిమా మరోసారి జనం ముందుకు రాబోతోంది.
పీపుల్ స్టార్ (People Star) ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) మూడు దశాబ్దాలకు పైగా తనదైన పంథాలో సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన రూపొందించిన 'యూనివర్సిటీ' (University) సినిమా రెండేళ్ళ క్రితం విడుదలైంది. అయితే అప్పుడు పరిస్థితులు అనుకూలించక పోవడంతో దీన్ని థియేటర్ల నుండి తీసేశారు. ఇప్పుడు తిరిగి మరోసారి 'యూనివర్సిటీ'ని జనం ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇప్పుడీ సినిమాకు 'పేపర్ లీక్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
బుధవారం సాయంత్రం 'యూనివర్సిటీ' మూవీని ఆర్. నారాయణమూర్తి పలువురు రాజకీయ ప్రముఖులకు, సామాజిక వేత్తలకు, విద్యార్థి నాయకులకు చూపించారు. ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ఈ స్పెషల్ షో కు గోరేటి వెంకన్న (Gorati Venkanna), అద్దంకి దయాకర్ (Addanki Dayakar), దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందిని సిద్ధారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం తదితరులు హాజరయ్యారు. అలానే పలువురు విద్యార్థి సంఘాల నాయకులు దీనిని వీక్షించారు. 'యూనివర్సిటీ' చిత్రాన్ని కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా చూడాలని వీరంతా కోరారు.
ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, 'గత కొన్నేళ్ళుగా జరుగుతున్న పేపర్ల లీక్ వ్యవహారంతో విద్యార్థుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. దానికి తోడు మాస్ కాపీయింగ్ తో అసమర్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతున్నారు. వీళ్ళ కారణంగా బ్రిడ్జిలు కూలిపోతాయి? రోగుల ప్రాణాలు హరించుకుపోతాయి. విద్యను జాతీయం చేసి, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సినిమా ద్వారా తెలియచేశాం' అని అన్నారు. ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలను గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేశ్ రాశారని, చిత్రాన్ని ఆగస్ట్ 22న విడుదల చేయబోతున్నానని ఆర్. నారాయణమూర్తి తెలిపారు.
Also Read: Abbas: సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అబ్బాస్...
Also Read: Seetha Payanam: ఏ ఊరికి వెళతావే పిల్లా.. అర్జున్ కూతురు ఇరగొట్టింది