సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Vishnu: కన్నప్ప కు కోపం తెప్పించకండి...

ABN, Publish Date - Jun 26 , 2025 | 09:32 AM

'కన్నప్ప' చిత్రం బృందం వ్యక్తిగత హననానికి, కువిమర్శలకు చెక్ పట్టింది. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా సినిమాను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ అంశమై ఢిల్లీ హైకోర్టు నుండి తమ హక్కులకు భంగం కలగకుండా ముందే అనుమతి పొందినట్టు తెలిపింది.

ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohanbabu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప' (Kannappa) శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాదు... కథ చారిత్రకాంశాలతో ముడిపడింది కావడంతో నిర్మాత మోహన్ బాబు స్థలపురాణం తెలిసి వారి నుండి, అలానే శ్రీకాళహస్తి క్షేత్ర పూజారులను నుండి కూడా వ్రాతపూర్వకమైన అనుమతి తీసుకున్నారు. సెన్సార్ పరమైన అభ్యంతరాలను క్లియర్ చేసి మూవీకి యు/ఎ సర్టిఫికెట్ పొందారు. సినిమాలోని గ్రాఫిక్స్ విషయంలోనూ రాజీ పడకుండా అవసరమైతే సినిమా రిలీజ్ డేట్ ను ఒకటికి రెండు సార్లు వాయిదా వేసి... వాటిని సంతృప్తికరంగా వచ్చే వరకూ చేయించారు.


ఇంత చేసినా... మోహన్ బాబు మనసులోనూ, మంచు విష్ణు (Manchu Vishnu) మనసులోనే ఎక్కడో ఏదో చిన్న సందేహం ఉండిపోయినట్టుగా ఉంది. తమ కుటుంబం మీద అక్కసుతో 'కన్నప్ప' చిత్రాన్ని ఇంట్లోని వారో బయటి వారో ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ చేసిన మాట్లాడతారేమోనని! అందుకే వీళ్ళు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు.

గతంలో కేరళలోని ఓ నిర్మాత తన చిత్రాన్ని అక్కసుతో విమర్శించిన వారిపై కోర్టు కెక్కిన నేపథ్యంలో వీరు కూడా ముందస్తుగానే కొన్ని చర్యలు తీసుకున్నారు. అన్ని రకాల అనుమతులు, జాగ్రత్తలతో 'కన్నప్ప' సినిమాను తీసినా... ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా, కువిమర్శలను, వ్యక్తిగత హననానికి పాల్పడితే తాము తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయమై తాజాగా మూవీ మేకర్స్ పబ్లిక్ కాషన్ నోటీస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఎలాంటి అపోహలకు, ముందస్తు అంచనాలకు పోకుండా తమ 'కన్నప్ప' చిత్రాన్ని చూడాలని, నచ్చితే దాని గురించి రాయాలని అలా కాకుండా తమ కుటుంబం మీద, తమ మీద ఉద్దేశ్యపూర్వకంగా ద్వేషపూరితంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని, ఆ రకంగా ముందే ఢిల్లీ హైకోర్టు నుండి అనుమతి పొందామని తెలిపారు.

సో... సినిమా చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడటం కానీ చేతికి వచ్చినట్టు రాయడం గానీ చేసి 'కన్నప్ప'కు ఆగ్రహం తెప్పిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని మోహన్ బాబు అండ్ కో తెలిపింది. మరి దీన్ని ఫిల్మ్ క్రిటిక్స్, నెటిజన్స్, సినిమాను చూసే ప్రేక్షకులు ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.

Also Read: Tv Movies: గురువారం.. తెలుగు టీవీ సినిమాలివే

Also Read: Tollywood: గద్దర్ అవార్డ్స్ విధివిధానాలపై అల్లాణి శ్రీధర్ మనోభావాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 26 , 2025 | 09:33 AM