Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది

ABN , Publish Date - Aug 17 , 2025 | 08:49 AM

తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటీమణులలో ప్రగతి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక వందల సినిమాల్లో నటించిన ప్రగతి... ఇటీవల పవర్‌ లిఫ్టింగ్‌ జాతీయ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ గెలిచారు. త్వరలో జరగనున్న ‘పవర్‌ లిఫ్టింగ్‌ ఆసియా ఛాంపియన్‌ షిప్స్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిని ‘నవ్య’ పలకరించింది.

Pragathi

తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటీమణులలో ప్రగతి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక వందల సినిమాల్లో నటించిన ప్రగతి... ఇటీవల పవర్‌ లిఫ్టింగ్‌ జాతీయ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ గెలిచారు. త్వరలో జరగనున్న ‘పవర్‌ లిఫ్టింగ్‌ ఆసియా ఛాంపియన్‌ షిప్స్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిని ‘నవ్య’ పలకరించింది.

ఎలా ఉన్నారు?

బాగున్నాను. కొత్త సవాళ్లు, వాటిని ఎదుర్కొవటం, గెలవటం... జీవితం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. పవర్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం గెలిచి అందరిని ఆశ్చర్యంలో ముంచారు..

ఈ క్రీడలోకి ఎలా ప్రవేశించారు?

చిన్నప్పటి నుంచి నాకు ఫిట్‌గా ఉండటమంటే ఇష్టం. అన్ని ఆటలూ ఆడేదాన్ని. కాలేజీలో నేను ఎన్‌సీసీలో ఉండేదాన్ని. ఎన్‌సీసీలో నాకు జాతీయ స్థాయి సైక్లింగ్‌లో గోల్డ్‌మెడల్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రతిరోజూ నడక తప్పనిసరిగా ఉండేది. అయితే గత 15 ఏళ్ల నుంచి ఫిట్‌నెస్‌ కోసం రోజూ జిమ్‌కు వెళ్లేదాన్ని. కొత్త రకాల ఎక్స్‌ర్‌సైజ్‌లు, కొత్త వర్కవుట్లు చేస్తూ ఉండేదాన్ని. సుమారు మూడేళ్ల క్రితం అనుకుంటా... నేను నివసించే కమ్యూనిటీలో ఒకావిడ పవర్‌లిఫ్టింగ్‌ శిక్షణ తీసుకొనేవారు. ఆవిణ్ణి చూసి పారు అనే నా స్నేహితురాలు ఆ శిక్షణలో చేరింది. తను వచ్చి - ‘నీకు పవర్‌ లిఫ్టింగ్‌ బాగా నచ్చుతుంది’ అని తనతో పాటు శిక్షణకు రమ్మంది. ‘సరే.. ఒక రోజు చూద్దాం’ అని నేనూ చేరాను. అలా నా పవర్‌లిఫ్టింగ్‌ ప్రస్థానం ప్రారంభమయింది

మూడేళ్లలో జాతీయ స్థాయిలో పతకం.. గెలవటం కష్టం కదా...

అవును. ఈ మూడేళ్లూ చాలా కష్టపడ్డా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నేను 2022లో మొదలుపెట్టాను. 2023లో కొన్ని సదరన్‌ స్టేట్స్‌ పోటీల్లో, నేషనల్స్‌లో పాల్గొన్నాను. 2024లో నా కాలికి సర్జరీ అయింది. దాంతో ఆ సంవత్సరమంతా పవర్‌లిఫ్టింగ్‌ చేయలేకపోయాను. ఈ ఏడాది ప్రారంభంలో మళ్లీ ట్రైనింగ్‌ మొదలుపెట్టా. ఈ నెలలో జరిగిన నేషనల్స్‌లో బంగారు పతకం వచ్చింది. డిసెంబర్‌లో ఆసియా ఛాంపియన్‌షి్‌ప్స ఉంది. దాన్లో మన దేశం నుంచి పాల్గొంటున్నా.


ఫైటింగ్‌ ప్రధానంగా ఉన్న సినిమా పాత్రలేమైనా చేశారా?

రెండు, మూడు సినిమాలు చేశాను. తెలుగులో ‘ప్రేమ ఖైదీ’ సినిమాను కన్నడంలో తీశారు. తెలుగులో శారదగారు చేసిన పాత్ర అక్కడ చేశాను. తెలుగులో ఆ పాత్రను వయస్సులో పెద్దదిగా చూపించారు. కన్నడంలో ఆ పాత్రకు తక్కువ వయస్సు ఉంటుంది. ఆ సినిమాలో ఫైట్స్‌ ఉంటాయి. సినిమా కోసం ఫైట్స్‌ చేయటం అదే తొలిసారి. ఆ తర్వాత విష్ణువర్ధన్‌ హీరోగా తీసిన ‘హృదయవసంత’ అనే సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ వేశాను. దానిలో కూడా కొన్ని ఫైట్స్‌ ఉంటాయి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్లిపోయాను. సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. అమెరికా నుంచి వచ్చి మళ్లీ సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫైటింగ్‌ పాత్రలు చేయలేదు.

మీరు ఎప్పుడూ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటారు? సోషల్‌ మీడియాలో మీ అప్‌డేట్స్‌ ఎందుకు కనిపించవు?

నేను గతంలో రెండు, మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాను. వాటి ద్వారా నా గురించి ప్రజలకు తెలుసు. నేను చెన్నైలో చదువుకున్నా. చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. నాకు ఇద్దరు పిల్లలు. నేను సింగిల్‌ మదర్‌ని. ఇంత కన్నా నా జీవితంలో చెప్పుకోదగ్గ విషయం కానీ, ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఏమి లేవు. గతంలో చెప్పిన విషయాలనే పదే పదే ఎందుకు చెప్పాలి? దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? అందుకే నేను మీడియాకు దూరంగా ఉంటా.

కానీ చాలా మంది సినీ తారలు తమ వ్యక్తిగత జీవితాల గురించి సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంటారు కదా...

నా వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు తెలిస్తే చాలు. ఒక విధంగా అది వారికి నేను ఇచ్చే గౌరవం. నాతో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు వారికి నేను పంచే ప్రేమ. ఆ వివరాలను అందరితో పంచుకోవటం నాకు ఇష్టం ఉండదు. ప్రేమించే వ్యక్తులకు నేను ప్రత్యేకంగా ఇచ్చే స్పేస్‌ అది. ఇకఆర్టిస్టుగా ప్రగతి గురించి ప్రేక్షకులకు ఎంత తెలియాలో అంత తెలిస్తే చాలు. ప్రగతి వ్యక్తిగత విషయాలు తెలియాల్సిన అవసరం లేదనేది నా భావన.

మీరు చాలా ఎమోషనలా?

అవునండి. నేను చాలా ఎమోషనల్‌. నేను మనుషులను చాలా త్వరగా నమ్మేస్తాను. త్వరగా హర్ట్‌ అవుతాను. బహుశా అందుకే నేను ఎక్కువమందికి దూరంగా ఉంటా. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది కదా!

Pragathi.jpg


PRag.jpg

మరి క్రీడల్లో గెలుపోటములు సహజం కదా! అంత ఎమోషనల్‌గా ఉంటే ఎలా ఆడగలుగుతారు?

నేను శారీరకంగా చాలా బలంగా ఉంటాను. మానసికంగా కొద్దిగా వీక్‌గా ఉండవచ్చు. అయితే ప్రతి రోజూ మూడు గంటల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీసు చేయటం, గెలవాలనే పట్టుదలతో పాజిటివ్‌ ఆలోచనలతో ఉండటం వల్ల నేను అనేక పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడు మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతున్నా! పవర్‌ లిఫ్టింగ్‌లోకి రాకముందు చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. నన్ను ఎవరూ ఏమీ అనకపోయినా- ‘అన్నారేమో’ అనే ఆలోచనలు నన్ను పీకుతూ ఉండేవి. పవర్‌ లిప్టింగ్‌లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది.

మీరు కొద్దిగా లేటు వయస్సులో పవర్‌ లిఫ్టింగ్‌లోకి ప్రవేశించారు కదా... ఇబ్బంది అనిపించలేదా?

లేదండి. పవర్‌ లిఫ్టింగ్‌ నన్ను శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతోంది. ప్రతి మహిళ జీవితంలో మోనోపాజ్‌ ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ ఉంటాయి. శారీరకంగా కూడా అనేక మార్పులు వస్తాయి. వాటన్నిటినీ తట్టుకోవటం చాలా కష్టం. ఈ దశలో నాకు పవర్‌ లిఫ్టింగ్‌ చాలా సాయం చేసింది. మోనోపాజ్‌ సమస్యలు ఎదుర్కొనేవారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే- ‘‘మీరు కూడా ఏదో ఒక యాక్టివిటీ ప్రారంభించండి. దీనివల్ల శారీరకంగా.. మానసికంగాను చాలా ప్రశాంతత లభిస్తుంది. మోనోపాజ్‌ వల్ల కలిగే రకరకాల మూడ్‌ స్వింగ్స్‌ తగ్గుతాయి. ఒక పని చేశామనే తృప్తి కలుగుతుంది. నా ఉద్దేశంలో 40 నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న మహిళలు అందం మీద కన్నా ఫిట్‌నెస్‌ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఒక మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకోటి ఉండదు. ఈ సంపదను మనం మాత్రమే సంపాదించుకోవాలి. ఎవ్వరూ ఇవ్వరు.

ఒక వైపు సినిమాలు.. మరో వైపు ప్రాక్టీసు... ఎలా సాధ్యమయింది?

నేను సినిమాలు చాలా తగ్గించేసుకున్నా. నాకు బాగా నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తున్నా. నాకు పవర్‌ లిఫ్టింగ్‌ ఎంత సంతృప్తి ఇస్తోందో... అంత సంతృప్తి ఇచ్చే పాత్ర వస్తేనే చేస్తాను. దీనికి నేను మానసికంగా సిద్ధపడ్డా.

అలా అయితే ఎక్కువ సినిమాలు చేయలేరు కదా...

నేను మంచి ఆర్టిస్టుని. నా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు చూశాను. నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ ఈ స్థితికి వచ్చాను. ఇప్పుడు నాకు సంతృప్తి చాలా అవసరం. మంచి పాత్రలు వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. డబ్బుల కోసం చేయను. నాది మిడిల్‌ క్లాస్‌ జీవన విధానం. ఉన్నంతలోనే బతుకుతాను. ఒకప్పుడు మంచి దుస్తులు, మేకప్‌ సామాన్లు, వాచీలు.. ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఆదశ దాటేశాను. వాటికి అయ్యే ఖర్చును పవర్‌లిఫ్టింగ్‌ శిక్షణమీద పెడుతున్నా.

  • ఆసియా ఛాంపియన్‌షిప్ లకు  వెళ్లటానికి చాలా ఖర్చవుతుంది. స్పాన్పర్లతో మాట్లాడుతున్నా. కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు.

  • ‘నేను పవర్‌ లిఫ్టింగ్‌ మొదలుపెట్టిన మొదటి రెండు నెలలు నరకం చూశాను. శరీరంలో ప్రతి అణువణువు నొప్పి పుట్టేది. ఆ నొప్పుల వల్ల రాత్రి నిద్ర పట్టేది కాదు. నొప్పితో, నిద్ర రాక ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. ‘మళ్లీ ప్రాక్టీసుకు వెళ్లకూడదు’ అని పడుకొనేదాన్ని. కానీ ఉదయం మామూలే! ప్రాక్టీసు వెళ్తే కలిగే తృప్తి వేరే ఉండేది. 

  • అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది. ఈ విషయం తెలిసిన తర్వాత నాలో మార్పు వచ్చింది. పవర్‌ లిఫ్టింగ్‌ను ప్రేమించడం నేర్చుకున్నా!

Updated Date - Aug 17 , 2025 | 09:12 AM