Thanal: లావణ్య త్రిపాఠి తమిళ సినిమా ఎప్పుడంటే...
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:22 AM
కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రం 'బ్రహ్మన్'లో నటించిన లావణ్య ఆ తర్వాత 'మాయవన్'లో యాక్ట్ చేసింది. తమిళంలో ఆచితూచి సినిమాలు అంగీకరిస్తున్న ఆమెకు మూడో తమిళ సినిమా 'టన్నెల్' ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
అలనాటి నటుడు మురళీ తనయుడు అధ్వర్య మురళీ (Atharvaa Murali) కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ యేడాది విడుదలైన అధ్వర్య సినిమా 'డి.ఎన్.ఎ.' (DNA) మంచి విజయాన్ని అందుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ థ్రిల్లర్ మూవీతో అధర్వ నటుడిగా మరోసారి మంచి మార్కులు వేయించుకున్నాడు. దాంతో అతని తాజా చిత్రం 'టన్నెల్' (Thanal) పై అంచనాలు పెరిగాయి.
తమిళంలో రవీంద్ర మధు రూపొందించిన ఈ సినిమాలో అధ్వర్య మురళీ సరసన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నటించింది. ఇది ఆమెకు తమిళంలో మూడో చిత్రం. కెరీర్ ప్రారంభంలోనే 'బ్రహ్మన్'లో నటించిన లావణ్య ఆ తర్వాత 'మాయవన్'లో యాక్ట్ చేసింది. తమిళంలో ఆచితూచి సినిమాలు అంగీకరిస్తున్న ఆమెకు 'టన్నెల్' ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. ప్రస్తుతం ఆమె తెలుగులో 'సతీ లీలావతి' మూవీలో యాక్ట్ చేస్తోంది. అది తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
ఊహించని ఓ దుర్ఘటన కొందరి వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే అంశంతో 'టన్నెల్' తెరకెక్కుతోంది. ఇదో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అశ్విన్ కాకుమాను ప్రతినాయకుడి పాత్ర చేసిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను అళగం పెరిమాళ్, బోస్ వెంకట్, షా రా, భరణి తదితరులు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. మీడియా టైమ్ సంస్థ నిర్మించిన 'టన్నెల్' తెలుగు, తమిళ భాషల్లో ఒక్కేసారి ఆగస్ట్ 29న విడుదల కాబోతోంది. 'డి.ఎన్.ఎ.' సక్సెస్ తర్వాత వస్తున్న ఈ సినిమా అధ్వర్య మురళీకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: Sunday Tv Movies: ఆదివారం ,ఆగస్టు 17.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
Also Read: Udaya Bhanu: ఆ చెక్కులతో ఇంటికి తోరణాలు కట్టుకోవచ్చు..