Telugu Film Chamber: ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికలు నిర్వహించాలి
ABN, Publish Date - Jul 26 , 2025 | 02:39 AM
షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే పోరాటం..
షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే పోరాటం చేస్తామని పలువురు నిర్మాతలు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ అధ్యక్షుడు డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె.ఎస్.రామారావు, అశోక్ కుమార్, బసిరెడ్డి, మోహన్ గౌడ్, విజయేందర్‌రెడ్డితోపాటు సి.కల్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇలాంటి గొప్ప అసోసియేషన్‌ను క్రమశిక్షణ ప్రకారం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అధ్యక్షులు భరత్ భూషణ్‌కి, ఇతర సభ్యులకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ‘ ఈనెల 30న జరగాల్సిన ఈసీ మీటింగ్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని, న్యాయపరంగా పోరాటం చేస్తామని’ అన్నారు. అశోక్ కమార్ మాట్లాడుతూ ‘ఈసీ మీటింగ్‌లో అంబికా ప్రసాద్ అనే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పాడని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రస్తుత కమిటీ నాయకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది’ అని అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలోని ప్రతి స్టార్‌కు, ప్రొడ్యూసర్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. అలాంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిరంకుశంగా మేమే కొనసాగుతాం అనడం కరెక్ట్ కాదు. ఎన్నికల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నాం. అలాగే మన ఎంపీలతోనూ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావింపజేస్తాం’ అని అన్నారు.
Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్
Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్