Tollywood: చలసాని గోపీ.. తనయుడు కన్నుమూత
ABN, Publish Date - Nov 26 , 2025 | 03:42 PM
ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో 'నేను ప్రేమిస్తున్నాను, నేటి గాంధీ' చిత్రాలను నిర్మించిన చలసాని ఆర్.బి. చౌదరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తండ్రి చలసాని గోపి, మావయ్య టి. త్రివిక్రమరావు తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఎన్టీఆర్ తో 'గజదొంగ', చిరంజీవితో 'అడవిదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాత చలసాని గోపీ (Chalasani Gopi) తనయుడు సిహెచ్.ఆర్.బి. చౌదరి (55) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు చలసాని రామబ్రహ్మం చౌదరి. తండ్రి బాటలో సాగుతూ చౌదరి సైతం జె.డి. చక్రవర్తి (J.D. Chakravarthi), రచన (Rachana) జంటగా ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'నేను ప్రేమిస్తున్నాను' చిత్రాన్ని జయశ్రీ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఆ తర్వాత ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలోనే 'నేటి గాంధీ' సినిమాను నిర్మించారు. అందులో రాజశేఖర్, రాశి జంటగా నటించారు. 2016లో నరేశ్ హీరోగా చలసాని రామబ్రహ్మం చౌదరి 'సెల్ఫీ రాజా' చిత్రాన్ని నిర్మించారు. 'దొంగ, కొండవీటి దొంగ' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమరావు కుమార్తెను చౌదరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన కృష్ణాజిల్లాలోని పెదమద్దాలిలో గురువారం జరుగనున్నాయి.