Raviteja: రైలు ప్రమాదంలో మరణించిన రవితేజ సినిమా దర్శకుడు...
ABN, Publish Date - Nov 24 , 2025 | 02:28 PM
రవితేజ, మణిచందన జంటగా 'మనసిచ్చాను' చిత్రాన్ని రూపొందించిన ప్రమోద్ కుమార్ హఠాన్మరణం చెందారు. ఈ నెల 21న రైల్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయినట్టు తెలిసింది.
తెలుగు సినిమా రంగంలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు ప్రమోద్ కుమార్ (Pramodh Kumar) హఠాన్మరణం చెందారు. మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) కెరీర్ ప్రారంభ దినాల్లో ఆయన హీరోగా తెరకెక్కిన సినిమా 'మనసిచ్చాను' (Manasichchanu). సిహెచ్ సుధాకర్ నిర్మించిన ఈ సినిమాతో ప్రమోద్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలుత దర్శకత్వ శాఖలో పనిచేసిన రవితేజ ఆ తర్వాత పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. 1999లో ఆయన సోలో హీరోగా 'నీ కోసం' (Nee Kosam) మూవీ వచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన రవితేజ... సోలో హీరోగా వచ్చిన రెండో సినిమా 'మనసిచ్చాను'. ఇందులో మణిచందన (Manichandana) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ముందు ప్రమోద్ కుమార్... 'చిటికెల పందిరి'లో ఆ చిత్ర కథానాయకుల్లో ఒకరైన ఆనంద చక్రపాణి (Ananda Chakrapani) పరిచయంతో నటించారు. ఆపైన దర్శకత్వం వైపే మొగ్గు చూపారు. రవితేజ హీరోగా 'మనసిచ్చాను' చిత్రాన్ని రూపొందించిన తర్వాత ఆయనకు మరే అవకాశం రాలేదు. అయినా సినిమా రంగంలోనే కొనసాగుతూ ఉన్నారు.
ఇటీవల మొదలైన నటి కుంభమేళా ఫేమ్ మోనాలిసా తెలుగు సినిమా 'లైఫ్' కు ప్రమోద్ కుమార్ కో-డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. నవంబర్ 21 వ తేదీ ఆయన భరత్ నగర్ రైల్వే లైన్ క్రాస్ చేస్తూ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఢీ కొనడంతో చనిపోయారని ప్రాధమిక విచారణలో తేలినట్టు సమాచారం. ప్రస్తుతం రైల్వే పోలీసులు ఈ కేసును పరిశోధిస్తున్నారు. దర్శకుడు ప్రమోద్ కుమార్ కు భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. ప్రమోద్ కుమార్ మృతి పట్ల స్నేహితులు, సినీ రంగానికి చెందిన వారు సంతాపం తెలిపారు.