Fish Venkat: ఫిష్ వెంకట్ పరిస్థితి విషమం.. ప్రభాస్ సాయం
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:11 PM
టాలీవుడ్.. ఎప్పుడూ ఒకే కుటుంబం. ఇక్కడ ఎవరికీ సమస్య వచ్చినా మిగతావారు తాము ఉన్నామని చేయి అందిస్తారు.
Fish Venkat: టాలీవుడ్.. ఎప్పుడూ ఒకే కుటుంబం. ఇక్కడ ఎవరికీ సమస్య వచ్చినా మిగతావారు తాము ఉన్నామని చేయి అందిస్తారు. ఇండస్ట్రీలో ఎవరికీ ఆరోగ్యం బాగోలేకపోయినా.. వారికి తాము అండగా ఉంటామని చెప్పుకొస్తారు. మొన్నటికి మొన్న నటి పావలా శ్యామలకు సాయి ధరమ్ తేజ్ ఆర్థిక సహాయం అందించాడు. నిన్నటికి నిన్న నటి పాకీజా కష్టాల్లో ఉందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రూ. 2 లక్షలు సాయం చేశాడు. ఇక ఇప్పుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) హాస్పిటల్ బిల్స్ అన్ని తానే చూసుకుంటానని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తన కామెడీతో, పంచ్ డైలాగ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, మిరపకాయ్ లాంటి సినిమాలు అతడికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక కొన్నిరోజులుగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోంది. కిడ్నీలు దెబ్బతినడంతో కుటుంబసభ్యులు ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి ఇంకా విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.
ఇక తన తండ్రి అనారోగ్యం గురించి చెప్తూ ఆర్థిక సాయం కావాలని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఒక వీడియో ద్వారా వేడుకుంది. ఆ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కొంతవరకు సహాయం చేశారు. అయితే తాజాగా ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఫిష్ వెంకట్ ఆపరేషన్ బిల్స్ అన్ని తాను కడతానని చెప్పినట్లు స్రవంతి మీడియా ద్వారా తెలిపింది.
' హీరో ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఆయన అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం' అని చెప్పినట్లు తెలిపింది. ఇక తన తండ్రి బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే కిడ్నీ దానం చేసే దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయమని వేడుకుంది. తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో తండ్రికి కిడ్నీ దానం చేయలేకపోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ గొప్ప మనసును నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. రాజు గారు అన్ని విషయాల్లో రాజునే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Director Anudeep: అయ్యయ్యో.. ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ ను అలా తోసేసారేంటయ్యా