Pawan Kalyan, Jr NTR: ఐపీ లాగిన్లు.. మూడు వారాల్లో అందించండి
ABN, Publish Date - Dec 23 , 2025 | 05:21 AM
పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో అనుమతి లేని వినియోగంపై మూడు వారాల్లో IP వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరి వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఉన్న ఐపీ లాగిన్ల వివరాలను మూడు వారాల్లో అందించాలని సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించింది.
సామాజిక మాధ్యమాల్లో తమ ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని వీరిద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఆ పిటిషన్లు సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. హైకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని లింకులను తొలగించినట్లు ప్రతివాదుల తరఫు న్యాయవాదులు తెలిపారు. అయితే కొన్ని లింకులను మాత్రమే తొలగించారని, మరికొన్ని అలాగే ఉన్నాయని పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు.
అవి ఎందుకు తొలగించలేదో తెలియజేయాలని.. సంబంధిత ఐపీ లాగిన్ల వివరాలను మూడు వారాల్లో అందించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. పలువురు సినీటులు, ప్రముఖులు కూడా తమ వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడాలని కోరుతూ ఇదే కోర్టును ఆశ్రయించగా.. వారికి మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడం తెలిసిందే.