Nuvvu Naaku Nachav: కొత్త సంవత్సరం తొలిరోజున...
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:07 PM
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాకు విజయ్ భాస్కర్ దర్శకుడు కాగా త్రివిక్రమ్ కథ, సంభాషణలు సమకూర్చాడు. 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా 2026 జనవరి 1న రీ-రిలీజ్ కాబోతోంది.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) సక్సెస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) భాగస్వామ్యంగా కూడా ఉంది. వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachchav), వాసు (Vasu), మల్లీశ్వరి (Malleeswari)' చిత్రాలకు త్రివిక్రమ్ పనిచేశారు. అందులో 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' చిత్రాలకు విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) దర్శకత్వం వహించగా కథ, మాటలను త్రివిక్రమ్ అందించారు. 'వాసు' సినిమాకు ఎ. కరుణాకరన్ కథకుడు, దర్శకుడు. త్రివిక్రమ్ దీనికి మాటలు రాశారు. ఇక త్రివిక్రమ్ దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టిన తర్వాత పలువురు హీరోలతో సినిమాలు చేశాడు కానీ వెంకటేశ్ తో కలిసి వర్క్ చేసే అవకాశం రాలేదు. ఆ లోటు అతి త్వరలో తీరబోతోంది. వెంకటేశ్ హీరోగా, త్రివిక్రమ్ ఇప్పుడో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది.
ఇదిలా ఉంటే వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్' అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా 2001 సెప్టెంబర్ 6న విడుదలైంది. ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ (Aarti Agarwal) హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె స్నేహితురాలిగా, ఇప్పటి బిగ్ బాస్ ఫేమ్ ఆశా సైనీ నటించింది. 'నువ్వు నాకు నచ్చావ్' ఆరంభం నుండి ముగింపు వరకూ ఫన్ రైడ్ ను తలపించేది. ఇప్పుడీ సినిమాను మరోసారి జనం ముందుకు తీసుకురావాలని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ భావిస్తున్నారు. 2026 జనవరి 1న ఈ సినిమాను 4కె తో ప్రపంచ వ్యాప్తంగా రీ-రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, యూరప్, యు.కె. లోనూ అత్యధిక థియేటర్లలో 'నువ్వు నాకు నచ్చావ్' ను రీ-రిలీజ్ చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ అయితే... ఖచ్చితంగా వెంకటేశ్ - త్రివిక్రమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొంటాయి.
Also Read: MSVG: మీసాల పిల్లా.. బాసూ గ్రేస్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాలా
Also Read: Nuvve Kavali: వందో రోజు ఒకే కాంప్లెక్స్ లో అన్ని థియేటర్స్ ఫుల్