Nuvve Kavali: వందో రోజు ఒకే కాంప్లెక్స్ లో అన్ని థియేటర్స్ ఫుల్
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:26 PM
తరుణ్, రిచా పల్లోడ్ జంటగా నటించిన 'నువ్వే కావాలి' అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇది విడుదలై పాతికేళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సినిమా మేకింగ్ ముచ్చట్లను సినిమా అసోసియేట్ ప్రొడ్యూసర్ 'స్రవంతి' రవికిశోర్ తెలిపారు.
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ 'నువ్వే కావాలి' సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమా పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మూవీ ముచ్చట్లను ఆయన ఏబీయన్ చిత్రజ్యోతికి ప్రత్యేకంగా తెలిపారు.
'నా కెరీర్ కు గ్రేట్ టర్నింగ్ పాయింట్ రాజేందప్రసాద్ (Rajendra Prasad) హీరోగా వంశీ (Vamsy) తెరకెక్కించిన 'లేడీస్ టైలర్' (Ladies Tailor). అప్పటి వరకూ చార్టెడ్ అక్కౌంటెంట్ గా ఉన్న నాకు ఇక సినిమానే ప్రపంచంగా మారిపోయింది. ఆ తర్వాత మంచి సినిమాలు చేసినా రకరకాల కారణాలతో లాస్ వచ్చింది. కొన్ని సినిమాలు పంపిణీ చేయడం కూడా దానికి కారణం. దాంతో లాస్ నుండి ఎలా బయట పడాలా? అని చూస్తున్న సమయంలోనే 'నువ్వే కావాలి' (Nuvve Kaavali) మాతృక 'నీరమ్' (Neeram) చూశాను. దానిని తెలుగులో విజయ భాస్కర్ తోనే చేయాలని అనుకున్నాను. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమాలు చూసి కాదు, అతనితో నాకు ఎప్పటి నుండో వ్యక్తిగత పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సీరియల్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుండేవాళ్ళం. భాస్కర్ ను ఆ సినిమాకు అనుకున్న తర్వాత త్రివిక్రమ్ మాతో చేరాడు. అప్పటికే అందరం ఆకలి మీద ఉన్నాం. ఆ టైమ్ లో ఈటీవీలోని బాపినీడు గారు ఎంతో సహకరించారు. రామోజీరావుగారిని కలిపించడం దగ్గర నుండి అన్నీ విషయాల్లోనూ దన్నుగా నిలిచారు. ఆ టైమ్ లో నటీనటులు, టెక్నీషియన్స్ అంతా చాలా కష్టపడి పనిచేశాం. అందులో సీతారామశాస్త్రిగారి కంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. 'నువ్వే కావాలి'ని ఆయన గొప్ప మ్యూజికల్ హిట్ గా నిలిపారు' అని అన్నారు.
సినిమా విడుదల గురించి చెబుతూ, 'ఈసినిమా హైదరాబాద్ లో మూడే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదట పెద్ద టాక్ లేదు. దిల్ షుక్ నగర్, కుకట్ పల్లితో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓడియన్ థియేటర్ లో రిలీజ్ అయ్యింది. అప్పటికీ ఓడియన్ థియేటర్ మీద చాలా బ్యాడ్ రిపోర్ట్ ఉండేది. దాంతో అక్కడ సౌండ్ సిస్టమ్ ను మార్చాం, బాత్ రూమ్ కు సున్నాలు వేయించాం.... మూడు, నాలుగు రోజుల తర్వాత సినిమా బాగా పికప్ అయ్యింది. నాకు ఆ సినిమా విజయం మీద బాగా నమ్మకం ఉండేది. ఆ నమ్మకం నిజమైంది. రామోజీరావు గారు ఏ రోజునా స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకోలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 'నువ్వే కావాలి' సినిమాకు మాకు రూ.1.5 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దానికి తగ్గట్టుగానే సినిమాను చేశాం. ఆ తర్వాత డీటీఎస్ కు, ఇంకో పాట ఉంటే బాగుంటుందనిపించడంతో ఆ పాట చిత్రీకరణకు మరికొంత అమౌంట్ రిలీజ్ చేశారు' అని అన్నారు.
సినిమాకు వచ్చిన ఆదరణ గురించి చెబుతూ, 'ఈ సినిమా కలెక్షన్స్ పరంగా, రన్ పరంగా రికార్డ్స్ సృష్టించింది. అప్పట్లో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేదాని కన్నా... ఎంత మంది చూశారు? అనేది గొప్ప విషయం. ఆ సినిమాను మూడు కోట్ల మంది చూశారని లెక్క తేలింది. ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏమంటే... వందో రోజున ఓడియన్ థియేటర్ లోని మిగిలిన రెండు థియేటర్లలోనూ ఈ సినిమానే ప్రదర్శించారు. అన్ని థియేటర్స్ లో, అన్ని షోస్ ఇది హౌస్ ఫుల్ అయ్యింది. జనం తొక్కిసలాటలో మూడు నాలుగు చోట్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇక పోతే ఈ సినిమాను రీ-రిలీజ్ చేయాల్సి అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఆ తరహా సినిమాలు ఇప్పటికే వందో, నూట ఇరవయ్యో వచ్చి ఉంటాయి. ఏదేమైనా అప్పట్లో 'నువ్వే కావాలి' ఓ ట్రెండ్ సెట్టర్' అని తెలిపారు.
Also Read: Suresh Gopi: డబ్బులు సరిపోవట్టేదు.. సినిమాలే బెస్ట్! నా మంత్రి పదవి అతనికి ఇచ్చేయండి
Also Read: NTR: ఇదెక్కడి విడ్డూరం.. డిజాస్టర్ మూవీకి ఓటీటీలో రికార్డ్