MSVG: మీసాల పిల్లా.. బాసూ గ్రేస్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాలా
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:40 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు. వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు.
MSVG: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు. వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటికే విశ్వంభర సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఇక ఈ సంక్రాంతికి మరో సినిమాను దింపుతున్నాడు. అదే మన శంకర వరప్రసాద్ గారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తోంది.
ఇప్పటికే MSVG నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనిల్ సినిమా అంటే ప్రమోషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మీసాల పిల్ల అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఎక్కడ చూసినా ఈ ప్రోమోనే కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. ఇక ఆ ఎదురుచూపులకు తెరలేపుతూ ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. బాసూ సాంగ్ వచ్చేసింది.
మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా అంటూ చిరు పాడే స్టైల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సాంగ్ లో మాజీ ఇల్లాలా అని ఉండడంతో.. ఇది భార్యాభర్తల విడిపోయాక మళ్లీ కలిసినప్పుడు వచ్చే సాంగ్ లా అనిపిస్తుంది. ముక్కు మీద కోపం ఉన్న భార్యను.. భర్త ప్రేమతో బతిమిలాడుతున్నట్లు కనిపిస్తుంది. తనను క్షమించమని భర్త చెప్పడం.. చాలా తప్పులు చేశావు క్షమించడం కష్టం అని భార్య చెప్పడం చాలా బావుంది.
లిరిక్స్ అన్ని ఒక ఎత్తు అయితే చిరు డ్యాన్స్ స్టెప్స్ మరో ఎత్తు. ఈ వయస్సులో కూడా అంతటి యంగ్ లుక్ లో కనిపించడం చాలా అరుదు. అంతేకాకుండా సింపుల్ స్టెప్స్ అయినా కూడా అవి చిరు చేస్తుంటే ఎంతో గ్రేస్ ఫుల్ గా కనిపించాయి. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ తమ వాయిస్ తో సాంగ్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ లో ఏదో మ్యాజిక్ ఉంటుందని మరోసారి నిరూపించాడు. విజువల్స్ చాలా గ్రాండ్ గా అనిపించాయి. సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొదటి సాంగ్ తోనే అనిల్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాడు. మరి ఈ సినిమాతో చిరు - అనిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.