Suresh Gopi: డబ్బులు సరిపోవట్టేదు.. సినిమాలే బెస్ట్! నా మంత్రి పదవి అతనికి ఇచ్చేయండి
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:19 PM
ప్రస్తుతం తనకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని, తనను మంత్రి పదవి నుండి తప్పిస్తే సినిమాల్లో నటిస్తానని సురేశ్ గోపీ చెబుతున్నాడు. తన స్థానంలో సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సదానందం మాస్టర్ కు ఆ పదవి ఇవ్వాలని సురేశ్ గోపీ కోరడం విశేషం.
మలయళ చిత్రసీమలో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న సురేశ్ గోపీ (Suresh Gopi) నటించిన సినిమా 'జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (Janaki Vs State of Kerala) ఇటీవల విడుదలైంది. సెన్సార్ సమస్యలను అధిగమించి కాస్తంత ఆలస్యంగా జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న సురేశ్ గోపీకి సైతం సెన్సార్ సమస్యలు తప్పలేదంటూ అప్పుడు మీడియాలో పలు వార్తలు హల్చల్ చేశాయి.
నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే సురేశ్ గోపీ రాజకీయాల్లోకి వచ్చారు. 2016లో బీజేపీ (BJP) లో చేరిన తర్వాత ఆయన అంచలంచెలుగా ఎదిగి, గత ఎన్నికల్లో కేరళ రాష్ట్రం త్రిస్సూర్ నుండి ఎంపీగా గెలిచారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు సహాయ మంత్రిగా బాధ్యతలను ఇచ్చింది. కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా సురేశ్ గోపీ ఇప్పుడు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. నిజానికి మంత్రిగా ప్రమాణ స్వీకరం చేయడానికి ముందే... పూర్తి సమయాన్ని రాజకీయాలకు ఇవ్వడం ఇష్టంలేని సురేశ్ గోపీ కొంత ఇబ్బందికి లోనయ్యాడు. మంత్రి పదవా? నటనా? అన్నప్పుడు నటన వైపే అతని మనసు మొగ్గ చూపింది. కానీ కేంద్ర నాయకత్వం ఒత్తిడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకతప్పలేదు.
అయితే ఇప్పుడు సురేశ్ గోపీలోని అసంతృప్తి మరోసారి బట్టబయలైంది. ఓ నటుడిగా తన హోదాను కొనసాగించడానికి, తనకున్న కమిట్ మెంట్స్ ను రీచ్ కావడానికి ప్రస్తుతం వస్తున్న జీతం సరిపోవడం లేదని, నటుడిగా ఉంటే మరింత మొత్తాన్ని తాను సంపాదించి ఉండేవాడినని సురేశ్ గోపీ చెబుతున్నాడు. సోమవారం కన్పూర్ లో ఇటీవల రాజ్యసభకు ఎంపికైన సదానందన్ మాస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన సురేశ్ గోపీ ఈ అంశాన్ని లేవలెత్తాడు. తనకంటే సీనియర్ అయిన సదానందన్ మాస్టర్ కు కేరళ నుండి మంత్రి పదవి ఇస్తే తాను సంతోషిస్తానని, తాను ఎప్పటిలా సినిమాలు చేసుకుంటానని మనసులో మాట చెప్పేశాడు.
సురేశ్ గోపీ మాటలను విని రాజకీయ రంగానికి చెందిన వారు నివ్వెర పోతున్నారు. ఎవరైనా కేంద్రంలో మంత్రిగా ఛాన్స్ వస్తే... చక్రం తిప్పాలనుకుంటారని, తన ప్రాభవాన్ని పెంచుకోవాలని చూస్తారని, కానీ సురేశ్ గోపీ అవినీతి మకిలి అంటకుండా జాగ్రత్త పడతూ, అసలు తనకు మంత్రి పదవే వద్దు అనడం విశేషమని భావిస్తున్నారు. మరో బీజీపీ కేంద్ర నాయకత్వం సురేశ్ గోపీ వినతిని అర్థం చేసుకుని, అతన్ని మంత్రి పదవి నుండి తప్పించి, సదానందం మాస్టర్ కు ఇస్తుందేమో చూడాలి.
Also Read: Aaryan Movie: ఐయామ్ ది గాయ్.. మెలోడీ సాంగ్ అదిరిపోయింది
Also Read: Chiranjeevi: ఆస్ట్రేలియాలో చిరుతో భేటీ.. ఎందుకంటే..