సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: కోర్టు మెట్లు ఎక్కుతున్న హీరోలు.. మొన్న నాగార్జున.. నిన్న చిరంజీవి.. నేడు ఎన్టీఆర్..

ABN, Publish Date - Dec 08 , 2025 | 06:29 PM

జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన పేరు, ఫొటో, వీడియోలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

NTR

NTR: జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన పేరు, ఫొటో, వీడియోలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై తక్షణం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఈ-కామర్స్ సంస్థలను ఆదేశించింది. ముఖ్యంగా, 2021 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు, ఆ రోజున మరింత వివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ అరోరా తెలిపారు.

గతంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి దక్షిణాది ప్రముఖులు కూడా తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు, ట్రోల్స్ వంటివి ఉపయోగించకుండా ఆదేశాలు తెచ్చుకోవడం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వారి బాటలోనే పయనించారు. ఈ తాజా పరిణామంతో, వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు, ఫొటోలను ఉపయోగిస్తే కచ్చితంగా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ నెలలో థియేటర్లలోకి విడుదల కానుందని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా చిత్రీకరణ వేగవంతంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి ప్రముఖ దర్శకులతో ఎన్టీఆర్ పని చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - Dec 08 , 2025 | 06:29 PM