Nithiin : రెండు సినిమాలు వదిలేసి... డ్యుయల్ రోల్ వైపు మొగ్గు...
ABN, Publish Date - Oct 29 , 2025 | 02:31 PM
హీరో నితిన్... రెండు దశాబ్దాల తర్వాత డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
కొందరు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతోంది. మరి కొందరు ఏది పట్టుకున్నా... కలిసి రాదు. ప్రస్తుతం నితిన్ (Nithiin) పరిస్థితి అలానే ఉంది. గత కొన్నేళ్ళుగా అతను రకరకాల ప్రయోగాలకు ఆస్కారం ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏది కూడా అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడం లేదు. కాలం కలిసి రాకపోవడం అంటే బహుశా ఇదే కావచ్చు. ఐదేళ్ళ క్రితం వచ్చిన 'భీష్మ' (Bheeshma) తర్వాత జనాలను కొద్దిగా మెప్పించిన సినిమా 'రంగ్ దే' (Rang de). నిజానికి అది కూడా కమర్షియల్ గా పెద్దంత విజయాన్ని ఏమీ అందుకోలేదు. కాకపోతే కొంతలో కొంత ఆడియెన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక ఆ తర్వాత చ్చిన 'మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ టార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్' తో పాటు మొన్నొచ్చిన 'తమ్ముడు' (Thammudu) కూడా నితిన్ కు పీడకలగా మిగిలిపోయాయి.
ఈ నేపథ్యంలో దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో చేయాల్సిన 'ఎల్లమ్మ' సినిమాను నితిన్ వదులుకున్నాడు. అలానే నితిన్, శ్రీను వైట్ల కాంబోలో ఓ సినిమా వస్తుందనే ప్రచారం ఆ మధ్య బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా ఉండదని తేలిపోయింది. ప్రస్తుతం నితిన్ దృష్టి అంతా వి.ఐ. ఆనంద్ తెరకెక్కించబోయే మూవీ మీద ఉందట. వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వి.ఐ. ఆనంద్... నితిన్ కు ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీ చెప్పాడట. అది నితిన్ కు బాగా నచ్చేసిందని సమాచారం. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ దీన్ని ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు బ్యానర్ లో చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ డ్యుయల్ రోల్ చేయబోతున్నాడట. విశేషం ఏమంటే.. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నితిన్ 'అల్లరి బుల్లోడు' మూవీలో డబుల్ రోల్ చేశాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మరి ఇంతకాలం తర్వాత నితిన్ చేస్తున్న డ్యుయల్ రోల్ మూవీ అతనికి పేరును, విజయాన్ని కూడా అందిస్తుందేమో చూడాలి.
Also Read: Tollywood: ఎంటర్ టైన్ మెంట్ హీరోలతో మల్టీస్టారర్
Also Read: Ram Potineni: ముందే రాబోతున్న.. 'ఆంధ్ర కింగ్ తాలూకా'