Chennai Love Story: ఎటు నుండి ఎటు వెళ్ళి ఎటు వచ్చింది!?

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:37 PM

'బేబి' గ్రాండ్ విక్టరీ తర్వాత ఎస్.కె.ఎన్., సాయి రాజేశ్ నిర్మించాలని అనుకున్న సినిమా అటు తిరిగి ఇటు తిరిగి ఎన్నో మార్పులు చేర్పులకు లోనైంది. ఇప్పుడీ సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'గా జనం ముందు రాబోతోంది.

కల్ట్ బ్లాక్ బస్టర్ 'బేబి' (Baby) తర్వాత సాయి రాజేశ్‌ (Sai Rajesh), ఎస్.కె.ఎన్. (SKN) నిర్మిస్తున్న సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story). ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఇవాళ జరిగింది. చిత్రం ఏమంటే... 'బేబి' సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా ఓ సినిమా తీయాలని సాయిరాజేశ్‌, ఎస్‌కేఎన్ నిర్ణయించుకున్నారు. వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన 'బేబి' సినిమాకు సాయి రాజేశ్‌ డైరెక్టర్. ఈ సినిమా విషయానికి వచ్చేసరికీ ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలకు పరిమితమై... దర్శకత్వ బాధ్యతలను నంబూరి రవి (Namburi Ravi) చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ... మూవీ మేకింగ్ లో చాలా జాప్యం జరిగిపోయింది. వైష్ణవి చైతన్య 'బేబి' తర్వాత దిల్ రాజు బ్యానర్ లో 'లవ్ మీ' (Love Me) మూవీ, 'జాక్' (Jack) చిత్రాలు చేసింది. దాంతో ఈ సినిమాకు ముందు అనుకున్న విధంగా డేట్స్ ఇవ్వలేదని సమాచారం. ఆ కోపంతోనే ఎస్.కె.ఎన్. ఓ సినిమా కార్యక్రమంలో వైష్ణవి చైతన్యను పరోక్షంగా విమర్శించాడని అంటూ ఉంటారు. ఆమె కూడా దానికి దీటుగా బదులిచ్చింది. అలానే కారణం ఏదైనా ఈ ప్రాజెక్ట్ నుండి ఊహించని విధంగా ఆనంద్ దేవరకొండ కూడా తప్పుకున్నాడు.


ఇప్పుడు రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేశ్‌, ఎస్.కె.ఎన్. తీస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోకి కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) వచ్చి చేరాడు. అలానే హీరోయిన్ గా శ్రీ గౌరి ప్రియ వచ్చింది. గతంలో శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) 'రైటర్ పద్మభూషణ్, మ్యాడ్' సినిమాలలో నటించింది. దీనికి ముందు కూడా కొన్ని సినిమాల్లో కాస్తంత ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది. అలానే 'మెయిల్' వెబ్ సీరిస్ లోనూ నటించింది. విశేషం ఏమంటే లాస్ట్ ఇయర్ శ్రీ గౌరీ ప్రియ నటించిన 'ట్రూ లవర్' చిత్రాన్ని 'లవర్' పేరుతో ఎస్.కె.ఎన్., మారుతీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే శ్రీ గౌరీ ప్రియ 'చెన్నై లవ్ స్టోరీ' లో హీరోయిన్ అయిపోయింది.

మూడేళ్ళ క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు చాలా మార్పులు జరిగిపోయాయి. 'బేబి' సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ ను అప్పట్లో ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఆ స్థానంలోకి ఇప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ వచ్చి చేరాడు. అలానే కెమెరామేన్, ఎడిటర్ కూడా మారిపోయారు. అప్పుడు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సాయి రాజేశ్‌ అనుకుంటే... ఇప్పుడు ఆయన కేవలం కథ, చిత్ర నిర్మాణానికి పరిమితమైపోయాడు. దర్శకుడు రవి నంబూరి స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నాడు. మొత్తానికీ మూడేళ్ళ ముందు ఎస్.కె.ఎన్., సాయి రాజేశ్‌ అనుకున్నది ఒకటి... ఇప్పుడు అయ్యింది మరొకటి. మరి ఈ 'చెన్నై లవ్ స్టోరీ' ఎంతమంది మనసుల్ని గెలుచుకుంటుందో చూడాలి.

Also Read: Hari Hara Veera Mallu: పవన్‌ కల్యాణ్‌ సినిమాకైనా అదే రూల్‌

Also Read: Ali: రాజేంద్రప్రసాద్‌ ఇష్యూ.. అలీ వివరణ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 02 , 2025 | 06:37 PM