Napoleon Team: ఆనంద్ రవి దర్శకత్వంలో కొత్త సినిమా
ABN , Publish Date - Aug 04 , 2025 | 06:37 PM
'నెపోలియన్' దర్శకుడు ఆనంద్ రవి మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఈ నెల 18న ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది కూడా 'నెపోలియన్' తరహాలోనే హారర్ మూవీ అని మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
ప్రముఖ రచయిత ఆనంద్ రవి (Anand Ravi) కి 'ప్రతినిధి' (Prathinidhi) చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు రచన చేసిన ఆయన 'నెపోలియన్' (Napoleon) మూవీతో 2017లో దర్శకుడు అయ్యాడు. భోగేంద్ర గుప్తా (Bhogendra Guptha) నిర్మించిన ఆ సినిమాలో ఆనంద్ రవి కీలక పాత్ర కూడా పోషించాడు. 'నా నీడ పోయింది సార్' అనే ఒకే వాక్యంతో ఆ మూవీకి హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హారర్ మూవీ తర్వాత ఆనంద్ రవి 2022లో 'కొరమీను' (Korameenu) అనే సినిమాకు కథ, మాటలు అందించాడు. అందులోనూ ఓ కీలక పాత్రను పోషించాడు.
ఇప్పుడు కాస్తంత గ్యాప్ తీసుకుని మరోసారి మెగాఫోన్ ను ఆనంద్ రవి చేతిలోకి తీసుకున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ఈ నెల 18న మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో ఆనంద్ రవి విడుదల చేశారు. ఇది కూడా 'నెపోలియన్' తరహాలో హారర్ మూవీనే అని పోస్టర్ బట్టి తెలుస్తోంది. విశేషం ఏమంటే... 'నెపోలియన్' మూవీ తర్వాత ఆ చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా 'సత్యం' రాజేశ్, కామాక్షి భాస్కరుని జంటగా 'పొలిమేర' చిత్రాన్ని నిర్మించారు. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి చక్కని ఆదరణ పొందింది. దాంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ లోగా మరోసారి తన 'నెపోలియన్' దర్శకుడు ఆనంద్ రవితో భోగేంద్ర గుప్తా ఈ హారర్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు.
ఈ సినిమాకు సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తున్నారు. రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్స్ కాగా, భీమ్ సాంబ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రధాన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Rajini - Satyaraj: నాలుగు దశాబ్దాల ఎడబాటును చెరిపేసిన 'కూలీ'
Also Read: Dulquer Salmaan: తెలుగులో.. దుల్కర్ మరో సినిమా! షూటింగ్ స్టార్ట్