Hit -3: టీవీల్లో రాబోతున్న నాని వయొలెంట్ మూవీ!
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:31 AM
నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ -3' మూవీ బుల్లితెరలోనూ ప్రత్యక్షం కాబోతోంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను టీవీ ఛానెల్స్ లో ప్రసారం కోసం రీ-సెన్సార్ కు మేకర్స్ అప్లయ్ చేశారని తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన 'హిట్ -3' (Hit -3) సినిమాను అతని కెరీర్ లోనే కాదు... తెలుగులో వచ్చిన అత్యంత హింసాత్మక చిత్రం అని విశ్లేషకులు కొందరు వ్యాఖ్యానించారు. నాని గత చిత్రాలకు భిన్నంగా ఇది 'ఎ' సర్టిఫికెట్ ను పొందింది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్స్ లో తెలిపారు. చిన్న పిల్లలు, వయసులో మరీ పెద్ద వాళ్ళు 'హిట్ -3'కి దూరంగా ఉండాలని, కథానుగుణంగా వయొలెన్స్ ను ఈ సినిమాలో పెట్టక తప్పలేదని వివరణ ఇచ్చాడు. మానసికంగా నాని అండ్ టీమ్ ప్రేక్షకులను అంతలా ప్రిపేర్ చేసినా... థియేటర్లలో 'హిట్ -3' చూసిన వాళ్ళు అవాక్కయ్యారు. నాని సినిమాలో ఇంత దారుణమైన సన్నివేశాలు ఉన్నాయేమిటీ అని వాపోయారు. ప్రస్తుతం వివిధ భాషల్లో ఈ తరహా హింసాత్మక చిత్రాలు బాగానే ప్రేక్షాకరణ పొందుతున్నాయని కొందరు చెబుతూ, అందుకు ఉదాహరణగా మలయాళ చిత్రం 'మార్కో'ను, హిందీ సినిమా 'కిల్'ను ఉదహరించారు. తెలుగు వారికి 'హిట్ -3' మరో 'మార్కో' (Marco) లేదా 'కిల్' (Kill) అని సరిపెట్టుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్లలో 'హిట్ -3'ని చూసి హింసను తట్టుకోలేక నోరు వెళ్లబెట్టిన చాలామంది... మే నెలాఖరులో ఓటీటీ (OTT) కి సెన్సార్ ఉండదు కాబట్టి నెట్ ఫ్లిక్స్ (Netfilx) లో 'హిట్ -3' అన్ ఎడిటెడ్ వర్షన్ చూసి ఖంగుతిన్నారు. ఓటీటీలో ఈ సినిమాను చూసిన తర్వాత... థియేట్రికల్ వర్షన్ చాలా బెటర్ గా ఉందని భావించారు.
ఇక ఇప్పుడు టీవీలో...
చిత్రం ఏమంటే... 'హిట్ -3' సినిమాలోని హింస గురించి సినీ గోయర్స్ లో అంతగా ప్రచారం జరిగిన తర్వాత కూడా ఈ మూవీ మేకర్స్ 'హిట్ -3'ని టీవీలో స్క్రీనింగ్ చేయడానికి సిద్థపడ్డారట. నిజానికి 'ఎ' సర్టిఫికెట్ పొందిన సినిమాలను ఏ ప్రైవేట్ టీవీ ఛానెల్స్ కూడా ప్రసారం చేయవు. ఖచ్చితంగా యు/ఎ సర్టిఫికెట్ పొందాల్సిందే. అందుకే 'ఎ' సర్టిఫికెట్ వచ్చిన చిత్రాలను నిర్మాతలు 'యు/ఎ' కన్వర్షన్ కోసం మళ్ళీ సెన్సార్ కు అప్లయ్ చేస్తారు. 'హిట్ -3' సినిమా నిర్మాతలు సైతం ఇప్పుడు 'యు/ఎ' సర్టిఫికేషన్ కోసం తిరిగి సెన్సార్ బోర్డ్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. 'హిట్ -3' మూవీ విడుదలకు ముందు 'మా సినిమాను కేవలం పెద్దలకు మాత్రమే తీశాం, ఈ హింసను తట్టుకునే ధైర్యం ఉన్నవాళ్ళే థియేటర్లకు రండి, ఇది అందరి కోసం తీసిన సినిమా కాదు' అని అంతగా గట్టిగా చెప్పిన హీరో నాని... ఇప్పుడు ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయడానికి ఎందుకు తహతహ లాడుతున్నాడో!? ఈ సినిమాకు ఆయన కూడా నిర్మాతే కాబట్టి... టీవీ ఛానెల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని నానికి బహుశా అనిపించి ఉండొచ్చు. దారుణమైన హింస ఉన్న కారణంగా 'హిట్ -3'కి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బృందం... ఇప్పుడు 'యు/ఎ' కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది? రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాను టీవీ వీక్షకుల కోసం ఎంత ఎడిట్ అవుతుందనేది చూడాలి!?
Also Read: EVV Satyanarayana: నవ్వుల (ఇ.వి.వి. సత్య) నారాయణ!
Also Read: HBD NBK: అనితరసాధ్యుడు నటసింహ బాలకృష్ణ!
Also Read: Movies In Tv: జూన్ 10 (మంగళ వారం).. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి