EVV Satyanarayana: నవ్వుల (ఇ.వి.వి. సత్య) నారాయణ!

ABN , Publish Date - Jun 09 , 2025 | 09:32 PM

కామెడీతో కబడ్డీ ఆడడమంటే ఎలాగో తెలుగువారికి చూపించారు ఇ.వి.వి. సత్యనారాయణ( Evv Satyanarayana) . ఆయన తెరకెక్కించిన 51 చిత్రాలలో సింహభాగం హాస్యంతో అలరించినవే!

కామెడీతో కబడ్డీ ఆడడమంటే ఎలాగో తెలుగువారికి చూపించారు ఇ.వి.వి. సత్యనారాయణ( Evv Satyanarayana) . ఆయన తెరకెక్కించిన 51 చిత్రాలలో సింహభాగం హాస్యంతో అలరించినవే! వాటిలోనే లవ్, సెంటిమెంట్, కామెడీ, ట్రాజెడీ అన్నీ మిక్స్ చేశారు ఇ.వి.వి. జూన్ 10 తేదీన ఇ.వి.వి. సత్యనారాయణ జయంతి.

పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడిలో జన్మించిన ఇ.వి.వి. సత్యనారాయణకు చిన్నప్పటి నుంచీ సినిమాలు, నాటకాలు అంటే మహా ఇష్టం! దాంతో చదువు అటకెక్కింది. చదువులో ఎలాగోలా 'మమ' అనిపించిన ఇ.వి.వి.కి సినిమారంగంలో రాణించాలన్న ఆశ కలిగింది. వెంటనే చెన్నై చెక్కేశారు. అక్కడ నవత పిక్చర్స్ పతాకంపై అభిరుచిగల చిత్రాలు నిర్మించిన కృష్ణంరాజును కలుసుకున్నారు. ఆ సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వంలో ఆయన 'నాగమల్లి' తీస్తున్నారు. నవతా కృష్ణంరాజు తన కంపెనీలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేర్చుకున్నారు. అక్కడ కొన్నాళ్ళు పనిచేశాక జంధ్యాల దగ్గర చేరారు ఇ.వి.వి. అక్కడే కితకితలు పెట్టడం ఎలాగో అభ్యసించారు. జంధ్యాల దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా, కో-డైరెక్టర్ గా పనిచేసిన ఇ.వి.వి. కొన్నాళ్ళకు ఓ కథ తయారు చేసుకొని డైరెక్షన్ ఛాన్స్ కోసం పలువురు నిర్మాతలను సంప్రదించారు. ఆ తీరునే సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడును కూడా కలిశారు ఇ.వి.వి. ఆయన సత్యనారాయణను దర్శకునిగా పరిచయం చేయాలని భావించారు. అయితే రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్ ఇ.వి.వి. కథ విని తాను దానిని సినిమాగా తీస్తానన్నారు. ఆ సినిమానే 'చెవిలో పువ్వు'. ఇ.వి.వి. తొలి చిత్రంగా వచ్చిన 'చెవిలో పువ్వు' అన్నీ సమకూరినా ఎందువల్లో పెద్దగా అలరించలేక పోయింది.

'చెవిలో పువ్వు' పరాజయం తరువాత రామానాయుడు సంస్థలోనే ఎలాగోలా డైరెక్టర్ కావాలని ఆశించారు ఇ.వి.వి. కథ సమకూర్చుకోమని నాయుడు చెప్పారు. ఆ సమయంలోనే కమల్ హాసన్ హీరోగా రామానాయుడు 'ఇంద్రుడు-చంద్రుడు' నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు తనకో కోడైరెక్టర్ కావాలని కమల్ కోరారు. ఆ విషయం తెలిసిన ఇ.వి.వి. తాను కమల్ దగ్గర పనిచేస్తానని అన్నారు. ఆల్రెడీ నువ్వు డైరెక్టర్ వి కదా... కో డైరెక్టర్ గా ఎందుకని రామానాయుడు కూడా వద్దన్నారు. కానీ, ఇ.వి.వి. ఎలాగైనా చేస్తానని చెప్పారు. సరే అన్నారు నాయుడు. అలా 'ఇంద్రుడు-చంద్రుడు'కు కోడైరెక్టర్ గా పనిచేసిన ఇ.వి.వి. ఎన్నో విషయాలు కమల్ హాసన్ నుండి నేర్చుకున్నానని చెప్పేవారు. తరువాత నాయుడు నిర్మించిన 'ప్రేమఖైదీ'తో తొలి విజయం చూసిన ఇ.వి.వి. ఆ పై వెనుదిరిగి చూసుకోలేదు.


టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబుతో చిత్రాలు రూపొందించారు ఇ.వి.వి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను హిందీ 'సూర్యవంశం'లో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి'కి దర్శకత్వం వహించింది కూడా ఇ.వి.వి.నే. "అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, వారసుడు, అబ్బాయిగారు, జంబలకిడి పంబ, హలో బ్రదర్, అల్లుడా మజాకా, ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు" వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తెరకెక్కించిన ఇ.వి.వి. 'ఆమె' సినిమాతో సెంటిమెంట్ కూడా భలేగా పండించారు. తన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ 'హాయ్' తెరకెక్కించారు. చిన్నకొడుకు నరేశ్ హీరోగా "కితకితలు, అత్తిలి సత్తిబాబు, బెండు అప్పారావ్, ఫిట్టింగ్ మాస్టర్, కత్తి కాంతారావు" వంటి చిత్రాలతో నవ్వులు పూయించారు. ఇద్దరు కొడుకులు హీరోలుగా 'నువ్వంటే నాకిష్టం...' తెరకెక్కించారు. అది అంతగా అలరించలేదు.

తన చిత్రాల ద్వారా కొందరు రచయితలు, నటీనటులను పరిచయం చేశారు ఇ.వి.వి. 'మానాన్నకి పెళ్ళి'తో ఎమ్మెస్ నారాయణకు, 'చాలాబాగుంది'తో ఎల్.బి.శ్రీరామ్ కు నటులుగా బ్రేక్ నిచ్చింది ఇ.వి.వి.నే. నవ్వుతూ నవ్విస్తూ సాగుతున్న ఇ.వి.వి. సత్యనారాయణ 2011లో కన్నుమూశారు. ఆయన పంచిన నవ్వులను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటూనే ఉంటారు, కితకితలకు లోనవుతూనే ఉంటారు.

Updated Date - Jun 09 , 2025 | 09:37 PM