NTR Birth Anniversary: ఫిల్మ్ నగర్ లో ఘనంగా వేడుకలు

ABN , Publish Date - May 28 , 2025 | 06:06 PM

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం చెంత ఆయన 102వ జయంతోత్సవాలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

నటరత్న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని శ్రీకృష్ణ రూప ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు సినీ ప్రముఖులు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'మన దేశం మూవీతో మొదలైన ఆయన సినీ ప్రయాణం 'నా దేశం'తో పూర్తవుతుందని అనుకున్నాం. కానీ 'మేజర్ చంద్రకాంత్'తో ఆయన ముగింపు పలికారు. దేవుడి రూపాలన్నింటినీ ఆ మహానుభావుడిలో చూడొచ్చు' అని అన్నారు. తమ తండ్రి ఓ అవతార పురుషుడని, ఆయన్ని భగవంతుడిగా భావిస్తుంటామని నందమూరి మోహనకృష్ణ తెలిపారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నమ్మి ఆచరించారని, ఈ యేడాది నుంచి ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జివో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని మోహనకృష్ణ అన్నారు.


ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, అలా చేస్తే ఆ అవార్డుకే గౌరవం పెరుగుతుందని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరికీ ఎన్టీఆర్ 102వ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని మాదాల రవి చెప్పారు. ఎన్టీఆర్ నటించిన ఐదో చిత్రం 'పాతాళ భైరవి' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమైందని, మన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అని తుమ్మల ప్రసన్నకుమార్ తెలిపారు. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి ఆత్మ గౌరవమని ఆయన మనవరాలు నందమూరి రూప చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, నటులు పాల్గొన్నారు.

Also Read: Hari Hara Veera Mallu: చెన్నైలో గీతావిష్కరణ

Also Read: NTR : ఎన్టీఆర్ జన్మదిన కానుకగా విడుదలైన సంసారం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 06:06 PM