NTR : ఎన్టీఆర్ జన్మదిన కానుకగా విడుదలైన సంసారం
ABN , Publish Date - May 28 , 2025 | 04:58 PM
ఎన్టీఆర్ 'సంసారం' పేరుతో రెండు సినిమాల్లో నటించారు. అందులో కలర్ లో తీసిన 'సంసారం' విడుదలై నేటికి యాభై యేళ్ళు పూర్తయ్యింది.
నటరత్న యన్టీఆర్ బర్త్ డే కానుకలుగా రిలీజైన సినిమాల్లో 'సంసారం' చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది... ఈ చిత్రం మే 28తో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది... అప్పట్లో 'సంసారం' సాగిన తీరును తెలుసుకుందాం.
యన్టీఆర్ (NTR) కెరీర్ లో ఆయన బర్త్ డే మే 28న రిలీజయిన మొట్టమొదటి సినిమా 'విచిత్ర కుటుంబం' (Vichitra Kutumbam). 1969లో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతకు ముందు యన్టీఆర్ జన్మదిన కానుకలుగా పలు చిత్రాలు వచ్చినా, అవి మే 28కి కొద్ది రోజుల ముందుగా వచ్చాయి. 'విచిత్ర కుటుంబం' రిలీజైన ఆరేళ్ళకు 1975లో యన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 28న వచ్చిన చిత్రం 'సంసారం' (Samsaram). అంతకు ముందు 1950లోనూ యన్టీఆర్ 'సంసారం' అనే సినిమాలో హీరోగా నటించారు. అదే 'సంసారం' టైటిల్ తో యన్టీఆర్ మరో సినిమా రావడం అప్పట్లో భలే ఆసక్తి రేకెత్తించింది. తాతినేని ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో ఈ 'సంసారం' చిత్రాన్ని రంగుల్లో నిర్మించారు. అందువల్ల కలర్ 'సంసారం' అనీ ఈ సినిమాకు ప్రచారం సాగింది. జమున (Jamuna) కథానాయికగా ఈ చిత్రం తెరకెక్కింది.
అప్పట్లో వర్ధమాన కథానాయికగా ఉన్న జయసుధ (Jayasudha) ఈ సినిమాలో యన్టీఆర్ కొడుకు పాత్రకు జోడీగా నటించడం విశేషం!. యన్టీఆర్ కూతురు పాత్రలో రోజారమణి కనిపించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే - చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన హీరో సంసారాన్ని ఆయన భార్య ఎలా నెట్టుకు వచ్చింది అన్నదే ఇందులోని ప్రధానాంశం. తరువాత అసలు నేరస్థులను హీరో చట్టానికి పట్టించడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రానికి టి. చలపతిరావు సంగీతం సమకూర్చగా, కొసరాజు, దాశరథి, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు.
'సంసారం' చిత్రం మంచి విజయం సాధించడంతో తరువాత పలువురు హీరోలు కూడా బర్త్ డే కానుకలుగా తమ సినిమాలను రిలీజ్ చేయసాగారు. 'సంసారం' శతదినోత్సవం జరుపుకుంది. 'విచిత్ర కుటుంబం, సంసారం' తరువాత యన్టీఆర్ కెరీర్ లో ఆయన ఐదు పాత్రలు పోషించిన 'శ్రీమద్విరాటపర్వము, సత్యం-శివం, జస్టిస్ చౌదరి, చండశాసనుడు, సమ్రాట్ అశోక" వంటి మూవీస్ బర్త్ డే కానుకలుగా అలరించాయి. ఈ చిత్రాలకు 'సంసారం' సక్సెస్ స్ఫూర్తిగా నిలచిందని చెప్పవచ్చు.
Also Read: Kannappa: విడుదలైన శ్రీ కాళ హస్తి గీతం
Also Read: Sandeep Reddy Vanga: వివాదంపై దీపిక పరోక్ష వ్యాఖ్యలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి