Hari Hara Veera Mallu: చెన్నైలో గీతావిష్కరణ

ABN , Publish Date - May 28 , 2025 | 05:23 PM

పవన్ కళ్యాణ్ స్వాతంత్ర సమర యోథుడిగా నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుండి 'తారా తారా' అనే గీతం విడుదలైంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, మూడు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో గీతం 'తార తార' విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం చెన్నైలో ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, 'చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. పలు గొప్ప తెలుగు సినిమాలను, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాను. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు బాధ్యతను క్రిష్ గారి దగ్గర నుంచి మా అబ్బాయి జ్యోతికృష్ణ తీసుకొని, సినిమా అద్భుతంగా రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాము' అని అన్నారు. ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, 'ఎ.ఎం. రత్నం గారి ముఖంలో నేను కోపం ఎప్పుడూ చూడలేదు. శాంతంగా, చిరునవ్వుతో ఉంటారు. ఆయన రియల్ హీరో. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను' అని చెప్పారు.


nidhi.jpeg

జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, 'అజిత్ గారి సూచన మేరకు నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో డైరెక్షన్ ను పక్కనపెట్టి, కొన్నేళ్లు ప్రొడక్షన్ వైపు ఉన్నాను. అదే మాట పవన్ కళ్యాణ్ గారు చెబుతూ, ఎ.ఎం. రత్నం గారి పేరు నిలబెట్టాలని అన్నారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. తెలివైన వారు, ఎన్నో విభాగాల్లో పట్టుంది. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేశారు. 'అసుర హననం' పాటలో ఫైట్ కి ఆయన కొరియోగ్రఫీ చేశారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోషించిన వీరమల్లు పాత్ర మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఉంటుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది' అని చెప్పారు. తమిళ వారికి ఎంజీఆర్ ఎలానో తెలుగువారికి ఎన్టీఆర్ అలా. ఆయన జయంతి రోజున ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని సత్యారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రముఖ నటుడు నాజర్, సత్యరాజ్, దర్శకులు కె.ఎస్. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: NTR : ఎన్టీఆర్ జన్మదిన కానుకగా విడుదలైన సంసారం

Also Read: Kannappa: విడుదలైన శ్రీ కాళ హస్తి గీతం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 05:24 PM