Refugee: మధుర స్మృతుల్లో ఆ ఇద్దరూ...

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:55 PM

అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ పరిచయం అయిన తొలి చిత్రం 'రిఫ్యూజీ' విడుదలై జూన్ 30కి పాతికేళ్ళు పూర్తయ్యింది. ఆ సందర్భంగా ఆనాటి అనుభవాలను కరీనా కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amithabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), రణధీర్ కపూర్ కుమార్తె కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా పరిచయం అయిన తొలి చిత్రం 'రిఫ్యూజీ' (Refugee). జె.పి. దత్తా (JP Dutta) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా విడుదలై జూన్ 30కి పాతికేళ్ళు పూర్తయ్యింది.


కరీనా కపూర్ తన తొలి చిత్రం 'రిఫ్యూజీ' విడుదలై రెండున్నర దశాబ్దాలు గడిచిన సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆ సినిమా ఫోటోస్ ను పోస్ట్ చేసింది. అలానే అమితాబ్ బచ్చన్ తన కొడుకు మొదటి సినిమా విడుదలై పాతికేళ్ళు అయిన సందర్భంగా తన మనో భావాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ అభిషేక్ ముందుకు సాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశేషం ఏమంటే... కరీనా కపూర్ అందుకున్న స్టార్ డమ్ తో పోల్చితే అభిషేక్ బచ్చన్ ఆ స్థాయి విజయాలను అందుకోలేదు. కరీనా కపూర్ కేవలం కమర్షియల్ సినిమాలలో నటించడమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తూ ముందుకు సాగుతోంది. సినిమా రంగానికే చెందిన సైఫ్ అలీ ఖాన్ ను కరీనా వివాహం చేసుకోగా, మిస్ వరల్డ్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ను అభిషేక్ బచ్చన్ ఏరి కోరి మనువాడాడు.


భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న వైరం నేపథ్యంలో అ్రకమ చొరబాట్ల కథాంశంతో 'రిఫ్యూజీ' చిత్రాన్ని జేపీ దత్తా తెరకెక్కించారు. ఈ సినిమా విజయాన్ని సాధించినా... స్టార్ కిడ్స్ చిత్రాలకు దక్కాల్సిన సక్సెస్ దక్కలేదు. అయితే ఆ యేడాది విడుదలైన హిందీ చిత్రాలలో అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన జాబితాలో ఐదో స్థానాన్ని 'రిఫ్యూజీ' దక్కించుకుంది. ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ సైతం వచ్చాయి. ఈ మూవీకి సంగీతం సమకూర్చిన అనూ మాలిక్ ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, గీత రచయిత జావేద్ అక్తర్ బెస్ట్ లిరిక్ రైటర్ గానూ నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రభుత్వ అవార్డులు అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ కు రాకపోయినా... పలు ప్రైవేట్ సంస్థలు ఇచ్చే బెస్ట్ డెబ్యూ యాక్టర్, యాక్ట్రస్ అవార్డులను వాళ్ళు అందుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ 'మై ప్రేమ్ కీ దీవానీ హూ' (Main Prem Ki Diwani Hoon), 'ఎల్.ఓ.సి. కార్గిల్' (LOC Kargil) చిత్రాలలో కలిసి నటించారు. ఏదేమైనా... పాతికేళ్ళుగా అప్రతిహతంగా వాళ్ళిద్దరూ సినిమా రంగంలో కొనసాగుతుండటం విశేషమే.

Also Read: Komalee Prasad: వాటిని న‌మ్మ‌కండి.. నాపై తప్పుడు వార్తలు ప్ర‌చారం చేస్తున్నారు

Also Read: Akkineni Amala: అభిమానులు కాదు రౌడీలు.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి

Updated Date - Jul 02 , 2025 | 03:55 PM