Ravi Teja: వినాయక చవితికి మాస్ జాతర
ABN , Publish Date - May 29 , 2025 | 12:35 PM
మాస్ మహరాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న జనం ముందుకు రాబోతోంది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara). భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. 'మాస్ జాతర' చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'మాస్ జాతర' రూపొందుతోందని, వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుందని మేకర్స్ తెలిపారు. ప్రచార చిత్రాలతోనే ఈ చిత్రం ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో అర్థమైందని అన్నారు. ఇటీవల మొదటి గీతం 'తు మేరా లవర్' విడుదలై అందరినీ ఉర్రూతలూగిస్తోందని, 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన 'తు మేరా లవర్' గీతం అభిమానులకు విందు భోజనంలా ఉందని చెప్పారు.
'మాస్ జాతర' చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తున్నారు. 'ధమాకా' జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) 'మాస్ జాతర' చిత్రానికి స్వరకర్త. 'ధమాకా' చిత్ర విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'మాస్ జాతర'తో మరోసారి మాస్ ప్రేక్షకులను మెప్పించనున్నారు. దర్శకుడు భాను బోగవరపు.. రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న ఆకట్టుకునే విజువల్స్ తో పక్కా కమర్షియల్ వైబ్ తీసుకొస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Gaddar Film Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి