Manchu Lakshmi: పొరపాటైపోయింది అంటారేమో అనుకున్నా.. అసలు వాళ్ళకి అదేమీ లేదు..
ABN, Publish Date - Sep 21 , 2025 | 10:01 AM
'మీ వయసుకు ఇలాంటి దుస్తులు వేసుకోవటం సబబేనా?’ అని ఎవరైనా అడిగితే ఏం చేస్తారు? అది కూడా లక్షలమంది చూసే ఇంటర్వ్యూలో... కొందరైతే- ‘వీడితో మనకెందుకు...’ అని వదిలేస్తారు. కానీ సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన మంచు లక్ష్మి అలా ఊరుకోలేదు.
'మీ వయసుకు ఇలాంటి దుస్తులు వేసుకోవటం సబబేనా?’ అని ఎవరైనా అడిగితే ఏం చేస్తారు? అది కూడా లక్షలమంది చూసే ఇంటర్వ్యూలో... కొందరైతే- ‘వీడితో మనకెందుకు...’ అని వదిలేస్తారు. కానీ సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన మంచు లక్ష్మి (Manchu Lakshmi) అలా ఊరుకోలేదు. తనను అలా ప్రశ్నించిన వెబ్‌సైట్ జర్నలిస్టును క్షమాపణలు చెప్పమని అడిగారు. అందుకు ఆ జర్నలిస్ట్ అంగీకరించకపోతే ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా మహిళను కాబట్టే తనకు న్యాయం జరగటం లేదంటున్నారు లక్ష్మి. కొద్ది రోజులుగా తాను అనుభవిస్తున్న వ్యధను ఆమె.. ‘నవ్య’తో పంచుకున్నారు. (Machu lakshmi need justice)
అతనికి వయసు పెరిగింది కానీ..
‘నేను తెలుగు సినీ పరిశ్రమలో పుట్టాను. పెరిగాను. పరిశ్రమ తీరుతెన్నులు నాకు బాగా తెలుసు. ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఉంటుందని కూడా తెలుసు. కానీ నా అస్థిత్వాన్ని, నా స్వేచ్ఛను హరించి, నన్ను కంచెలలో బంధించాలంటే మాత్రం భరించలేను. ఎందుకంటే అది నా వ్యక్తిత్వం కాదు. ఈ సమాజంలో మహిళల పట్ల వివక్ష అన్ని రకాలుగానూ ఉంటుంది. కానీ అది బయటకు కనిపించదు. మహిళలు బయటకు వెళ్లాలంటే లక్ష రకాలుగా ఆలోచిస్తారు. ‘నేను వేసుకొనే దుస్తులు బావున్నాయా? ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారా?’- ఇలాంటి ఆలోచనలు ఎన్నో! గతవారం నా సినిమా ‘దక్ష’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘గ్రేటాంధ్ర’ అనే వెబ్‌సైట్‌లో పనిచేసే మూర్తి అనే ఒక జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆయన వయసులో చాలా పెద్దవారు. తన ఇంటర్వ్యూలలో అవతలి వ్యక్తులను అవమానిస్తూ ఉంటారు. ఇటీవలే తేజ సజ్జాను కూడా అవమానించారు. తేజ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మాటలకు నేను కూడా హర్ట్ అయ్యా! బురద మీద రాయి వేస్తే అది మన మొహం మీదే చిమ్ముతుందంటారు. దీన్ని ఇప్పటిదాకా నేను నమ్మేదాన్ని. అందుకే నేను స్పందించలేదు. నన్ను చేసిన ఇంటర్వ్యూలో నా వయసు గురించి, నేను వేసుకున్న దుస్తులు మీద కామెంట్ చేశారు. ఆయనకు ఆ ఇంటర్వ్యూలోనే సమాధానం చెప్పాను. ‘పొరపాటైపోయింది.. ఏదో ఫ్లోలో వచ్చేసింది...’ అంటారేమో అనుకున్నా. కానీ ఆయన - ‘‘ఇదంతా అలవాటే. వైరల్ అయిం దా? లేదా’ అని నవ్వారు. ఆ మాటలకు నేను చాలా హర్ట్ అయ్యా! ‘ఒక మహిళను అంత చులకనగా చూస్తారా? ఆమెకు తనకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ కూడా లేదా? ఒకవేళ తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటే పరిహసిస్తారా?’ అనే ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూ విడుదలయిన వెంటనే సినిమా ఇండస్ట్రీలో అనేకమంది నాకు కాల్స్ చేశారు. నాకు మద్దతుగా నిలుస్తామన్నారు. ఆయనపై ఫిర్యాదు చేయమన్నారు.
కనీస స్పందన లేదు...
ఆయన మాట్లాడిన వెకిలి మాటలకు క్షమాపణలు చెప్పించమని కోరుతూ ఫిల్మ్‌ఛాంబర్‌కు, ‘మా’ అసోసియేషన్‌కు ఫిర్యాదు పంపించాను. కానీ ఎటువంటి స్పందన లేదు. పైగా ‘ఏ మూర్తి?’ అని అడిగారు. ఆ వివరాలను కూడా పంపాను. బహిరంగంగా ఒక వ్యక్తి నన్ను అవహేళన చేస్తే... దాని రికార్డులు కూడా ఉంటే ఎవ్వరూ స్పందించటానికి ముందుకు రాకపోవటం ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇదే ఒక హీరోకి జరిగితే పరిశ్రమ ఇలాగే స్పందిస్తుందా?’ అనిపించింది. ‘నా కోసం నేను నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు’ అనిపించింది.
మా మీద రాసి బతుకుతున్నారు..
ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. నన్ను ఇంటర్వ్యూ చేసిన వెబ్‌సైట్ కూడా క్షమాపణలు చెప్పలేదు. కనీసం ‘మేము చింతిస్తున్నాం’ అనే మాట కూడా పబ్లిష్ చేయలేదు. పైగా ‘‘ఆ ఫిర్యాదు ఎందుకు? ఇక్కడితో వదిలేయ్’ అని అనేక ఫోన్లు వచ్చాయి. సోషల్ మీడియా విస్తృత ప్రచారంలోకి వచ్చిన తర్వాత వెబ్‌సైట్ల పేరుతో అనేకమంది రకరకాల దందాలు చేస్తున్నారు. బయట ప్రపంచంలోకి వచ్చి - ‘మేము ఈ వార్త రాశాం’ అని చెప్పుకొనే ధైర్యం కూడా ఉండదు. మా చేతుల ఫోటోలు, కాళ్ల ఫోటోలు, నడుముల ఫోటోలు వేసుకొని బతుకుతున్న వెబ్‌సైట్లు ఎన్నో ఉన్నాయి. మామీద గాసిప్స్ రాసి బతికేవాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరినీ బాగు చేయాలనుకోవటం లేదు. కానీ నన్ను బహిరంగంగా అవమానించినప్పుడు- క్షమాపణ కోరటం కూడా తప్పేనా? ‘మన సమాజంలో పురుషాధిక్యత ఇంత వేళ్లూనుకుందా?’ అనిపిస్తోంది. నన్ను అవమానించిన వ్యక్తి ఇంట్లో మహిళలు ఎంత దుర్భర పరిస్థితిలో బతుకుతున్నారో? అనిపిస్తోంది.