Modi Biopic: నరేంద్ర మోదీగా.. ఉన్ని ముకుందన్
ABN, Publish Date - Sep 17 , 2025 | 01:41 PM
నరేంద్రమోదీ బయోపిక్ ఒకటి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో మోదీగా మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నాడు. దీనికి 'మా వందే' అనే పేరు ఖరారు చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా దీని ప్రకటన వెలువడింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) 75వ జన్మదిన వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇదిలా ఉంటే... నరేంద్ర మోదీ బయోపిక్ ను నిర్మిస్తున్నట్టు సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని నిర్మాత వీర్ రెడ్డి ఎం. (Veer Reddy M) తెలియచేశారు. 'మా వందే' (Maa Vande) పేరుతో మోదీ బయోపిక్ ను తీస్తున్నామని, ఇందులో ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) మోదీ పాత్రను పోషిస్తున్నారని, సి.హెచ్. క్రాంతి కుమార్ (Kranthi Kumar CH) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నామని అన్నారు. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని చెప్పారు.
ఈ సినిమా గురించి వీర్ రెడ్డి మాట్లాడుతూ, 'మోదీ గారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే 'మా వందే' చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మిస్తున్నాం. ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి గల అనుబంధం ఈ చిత్రంలో భావోద్వేగాలను పంచనుంది. మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రధాని మోదీ జీవిత విశేషాలను ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆవిష్కరించబోతున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి కింగ్ సాలోమన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించబోతున్నాడు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవి బ్రాసుర్ సంగీతం సమకూర్చబోతున్నారు.
Also Read: Mirai: హీరో, డైరెక్టర్ కు కార్ గిఫ్ట్...
Also Read: Kantara Chapter 1: అలా అయితే కష్టమే అంటున్న రిషభ్ బృందం