Prakash Raj: రాజమౌళి 'వారణాసి'.. నా దాహార్తి తీర్చుతోంది
ABN , Publish Date - Dec 23 , 2025 | 09:58 PM
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో తానో కీలక పాత్ర పోషిస్తున్నానని, తాజాగా ఓ షెడ్యూల్ పూర్తయ్యిందని జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపాడు.
ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Raja Mouli) కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి' (Varanasi) కి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ జరగడం లేదని కొందరు, జరుగుతోందని మరికొందరు సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు వార్తలను స్ప్రెడ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో షెడ్యూల్ పూర్తయ్యిందనే వార్త మహేశ్ బాబు అభిమానుల్లో సరికొత్త జోష్ ను నింపింది. ఈ అప్ డేట్ ఇచ్చింది మరెవరో కాదు జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj). 'వారణాసి' షూటింగ్ లో తాను పాల్గొన్నాడు.
'విక్రమార్కుడు' (Vikramarkudu) సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ నటించడం ఇదే. మధ్యలో రాజమౌళి తెరకెక్కించిన ఏ చిత్రంలోనూ ప్రకాశ్ రాజ్ నటించలేదు. అయితే మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ కాంబోలో మాత్రం సినిమాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. 'వారణాసి' మూవీ తాజా షెడ్యూల్ పూర్తయ్యిందని, తన నట దాహార్తిని ఈ సినిమా తీర్చుతోందని ప్రకాశ్ రాజ్ పేర్కొనడం విశేషం. దాంతో ప్రకాశ్ రాజ్ ది ఇందులో చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు స్టార్ కాస్ట్ లో ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా జత కలవడంతో సహజంగానే ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి.