Mahesh babu in Mirai: మిరాయ్ లో మహేశ్... ప్రచారానికి కారణం ఇదే...

ABN , Publish Date - Sep 14 , 2025 | 06:42 PM

'మిరాయ్' మూవీలో శ్రీరాముడిగా మహేశ్ నటించాడట అనే ప్రచారం బూటకమని తేలిపోయింది. అయితే రాముడిగా నటించిన గౌరవ్ బోరా మహేశ్ బాబును పోలి ఉండటంతో కొందరు ఆ రకంగా పొరబడి ఈ ప్రచారం చేశారని తెలుస్తోంది.

Mahesh Babu - Gaurav Bora

తేజ సజ్జా హీరోగా టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన 'మిరాయ్' సినిమా విజయపథంలో సాగిపోతోంది. మొదటి రెండు రోజులకే రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ ఒరవడి చూస్తుంటే... 'మిరాయ్' కలెక్షన్స్ 'హను-మాన్' మూవీని క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విశేషం ఏమంటే... ఈ సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ ప్రచారం జరిగింది. 'మిరాయ్'లో మహేశ్ బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్నాడన్నది దాని సారాంశం. రాజమౌళి సినిమాకు కమిట్ అయిన మహేశ్ బాబు... ఆ సినిమా విడుదల కాకుండా మరో సినిమాలో నటించడం, అది గెస్ట్ రోల్ అయినా కానీ అసాధ్యమనేది సినిమా రంగానికి చెందిన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యలో మహేశ్ వాణిజ్య ప్రకటనలలో కనిపించగా లేనిది 'మిరాయ్'లో గెస్ట్ రోల్ ఎందుకు చేయకూడదూ? అనే అనుమానాన్ని కొందరు లేవనెత్తారు.


'మిరాయ్'లో మహేశ్ బాబు ఉన్నాడట...' అంటూ జరిగిన ప్రచారంపై మేకర్స్ పెదవి విప్పలేదు. అయితే కొందరు మాత్రం చూసినట్టే ఈ మాటను బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే... ఇందులో శ్రీరాముడి పాత్ర పోషించిన వ్యక్తి ఫోటో బయటకు వచ్చిన తర్వాత కొందరు చేసిన ప్రచారానికి కారణం అదే అనే విషయం అర్థమౌంది. పై పోస్ట్ చేసిన ఫోటో ను ఠక్కున చూస్తే... రెండు మహేశ్ బాబు ఫోటోలే అనేట్టుగా ఉంది. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఈ రెండు ఫోటోలలోని వ్యత్యాసం ఖచ్చితంగా తెలుస్తుంది. అందులో డౌట్ లేదు. కానీ దూరంగానో, స్క్రీన్ మీద లాంగ్ షాట్ లో చూసినప్పుడో ఇద్దరూ ఒకరే అనుకునే ఛాన్స్ లేకపోలేదు. అయితే 'మిరాయ్' సినిమాలో రాముడి పాత్రను పూర్తి స్థాయిలో మేకర్స్ చూపించలేదు. గౌరవ్ బోరా అనే ఉత్తరాఖండ్ నటుడితో ఈ పాత్ర చేయించారు. కానీ పూర్తి స్థాయిలో అతన్ని చూపించకుండా వి.ఎఫ్.ఎక్స్. లో కాస్త మార్చి చూపించారు. దాంతో కొన్ని యాంగిల్స్ శ్రీరాముడి పాత్రను చూస్తే మహేశ్ బాబే దానిని చేశాడనే భావన కలుగుతుంది. బహుశా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లేదా విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్న సమయంలో మహేశ్ బాబులా ఆ పాత్రధారి అనిపించడంతో అతనే నటించాడనే ప్రచారం జరిగిపోయింది.

garurav.jpg

శుక్రవారం 'మిరాయ్' సినిమా విడుదలైన తర్వాత దాన్ని చూసిన వాళ్ళకు రాముడి పాత్ర చేసింది మహేశ్ బాబు కాదు అనే విషయం తెలిసింది. అయితే ఎవరు చేశారనే ప్రశ్నకు సమాధానంగా గౌరవ్ బోరా పేరు బయటకు వచ్చింది. టీవీ సీరియల్స్, వెబ్ సీరిస్ లో నటించిన గౌరవ్ బోరా రంగస్థల కళాకారుడు కూడా. అతని ఫోటోలను పరిశీలించినప్పుడు ఒక ఫోటోలో 'నాని' సినిమాలో మహేశ్ బాబు ఉన్నట్టే గౌరవ్ బోరా ఉండటం విశేషం. అలానే రాముడి పాత్రధారణలోనూ గౌరవ్ ఇంచుమించు మహేశ్ బాబునే తలపించాడు. సో... పాపం మహేశ్ బాబు గురించి ప్రచారం చేసిన వారి తప్పు పట్టాల్సిన అవసరం లేదు!

Also Read: Mirage: జీతూ జోసెఫ్.. మైండ్ బెండింగ్ థ్రిల్లర్ 'మిరేజ్' ట్రైల‌ర్ చూశారా

Also Read: Director Maruthi: బూతు డైరెక్టర్ అన్నారు.. రాజాసాబ్ తీస్తున్నా...

Updated Date - Sep 14 , 2025 | 06:44 PM