Director Maruthi: బూతు డైరెక్టర్ అన్నారు.. రాజాసాబ్ తీస్తున్నా
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:17 PM
డైరెక్టర్ మారుతీ (Maruthi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజాసాబ్ (The Rajasaab).
Director Maruthi: డైరెక్టర్ మారుతీ (Maruthi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజాసాబ్ (The Rajasaab). ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మారుతీ బ్యూటీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని.. కొత్త డైరెక్టర్స్ చేసే స్టంట్స్ పై ఫైర్ అయ్యాడు.
ముఖ్యంగా త్రిబాణధారి బార్బరిక్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స.. తన సినిమాను ఎవరు ఆదరించలేదని చెప్పుతో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. మారుతీ ఆ డైరెక్టర్ గురించి ఈ ఈవెంట్ లో మాట్లాడాడు. సినిమా కోసం ఇంతలా దిగజారతారా.. ఇది కాకపోతే ఇంకో సినిమా అని అనుకోవాలని దైర్యం చెప్పాడు. అంతేకాకుండా బూతులు మాట్లాడినంత మాత్రన సినిమాలు హిట్ అవ్వవు అని తెలిపాడు. ' బార్బారిక్ అని విజయ్ గారు మంచి సినిమా తీశారు. ఆ డైరెక్టర్ కూడా చాలా మంచివాడు. వందసార్లు చెప్పాను. ఆ టైటిల్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా లేదు. మార్చు అని.. చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని.
ఆ డైరెక్టర్ వేరే ట్రాన్స్ లో ఉన్నాడు. బార్బరిక్ దేవుడు అని, ఆయనే కథ అని అనుకునేవాడు. మనం ఫీల్ అవ్వడం వేరు.. ఆడియెన్స్ ఫీల్ అవ్వడం వేరు. ఆడియెన్స్ మనసులో లేని దేవుడిని మనం బలవంతంగా తీసుకెళ్లలేం. ఒక డైరెక్టర్ గా ఇంకొక డైరెక్టర్ ని ఫోర్స్ చేయలేము. చివరికి ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. అది నాకు చాలా బాధనిపించింది. డైరెక్టర్, కళాకారుడు.. పదిమందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నాను అంటే.. ఆడియెన్స్ ను రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటే.. బూతులు మాట్లాడుతున్నారు. చొక్కా తీసి తిరుగుతాను అంటున్నారు. అసలు సినిమాలే మానేస్తాను అంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతావా.. ఇంత దారుణంగా మాట్లాడతారా.. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా ఆడుతుంది. దానికి నేను రాను, ఇండస్ట్రీ మానేస్తా.. చొక్కా విప్పుకు తిరుగుతా.. బూతులు మాట్లాడతా ఏంటి అసలు ఇది.
కల్చర్ ఎటు వెళ్తుంది. ప్రతి సినిమాకు చూస్తున్నా కొద్దిగా కాంట్రవర్సీ మాట్లాడితే సినిమా వెళ్తుంది. బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ లు, బూతులు నాకంటే గొప్పగా ఎవడూ రాయడు. అవన్నీ బస్టాప్ తోనే ఆపేశాను. ఎందుకంటే ప్రేక్షకులు కుటుంబాలతో థియేటర్ కు రావాలి. ఒకప్పుడు నాపై బూతు డైరెక్టర్ అని ముద్ర వేశారు. ఇప్పుడు అదే బూతు డైరెక్టర్ రూ. 400 కోట్లతో ది రాజాసాబ్ సినిమా తీస్తున్నాడు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సినిమాను నమ్మండి.. కంటెంట్ ను నమ్మండి.. జనం ఎప్పుడు మంచి సినిమాను ఆదరిస్తారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మారుతీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.