Nandamuri Kalyan Chakravarthy: 35 యేండ్ల తర్వాత సినిమాల్లోకి.. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ
ABN, Publish Date - Dec 06 , 2025 | 05:55 PM
నందమూరి తారక రామారావు తమ్ముడి కొడుకు కళ్యాణ్ చక్రవర్తి 35 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నాడు. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న 'ఛాంపియన్' చిత్రంతో ఆయన రాజిరెడ్డి అనే పాత్రను పోషించారు.
తెలుగు సినిమా రంగానికి వెన్నెముకగా నిలిచింది నందమూరి కుటుంబం (Nandamuri Family). మహానటుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao), ఆయన సోదరుడు త్రివిక్రమరావు తెలుగు సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు. ఇవాళ ఎన్టీఆర్ (NTR) నట వారసుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుమారులిద్దరూ కూడా సినిమాల్లో నటించారు. పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy) చాలా సినిమాల్లో నటించాడు, రెండో కొడుకు హరీన్ చక్రవర్తి (Hareen Chakravarthy) రెండు మూడు సినిమాలకు చేసి ఆ తర్వాత నటనకు స్వస్తి పలికాడు.
నందమూరి కళ్యాణ చక్రవర్తి, 1974లో 'మనుషుల్లో దేవుడు' చిత్రంలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా నటించాడు. ఆ తర్వాత 1976లో 'అత్తగారు స్వాగతం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ పైన 'తలంబ్రాలు, మామా కోడలు సవాల్, ఇంటిదొంగ, మారణ హోమం, అత్తగారు జిందాబాద్...' ఇలా పన్నెండు సినిమాల్లో నటించాడు. చివరగా విజయచందర్ టైటిల్ రోల్ పోషించిన 'కబీర్ దాస్' మూవీలో శ్రీరాముడిగా కళ్యాణ్ చక్రవర్తి నటించాడు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా కుటుంబ వ్యాపారాలలో తలమునకలై పోయాడు. ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత మరోసారి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకొచ్చాడు.
డిసెంబర్ 25 విడుదల కాబోతున్న 'ఛాంపియన్' సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి... రాజిరెడ్డి అనే పాత్రను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో శనివారం పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న 'ఛాంపియన్'లో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ నామకరణం చేసిన వైజయంతి మూవీస్ సంస్థ తోనే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ-ఎంట్రీ ఇస్తుండటం ఎంతైనా విశేషం.
Also Read: Sunday Tv Movies: ఆదివారం, Dec 07.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
Also Read: Sharwanand: సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా...