Jr NTR: తాత బాటలో మనవడు నడుస్తాడా...

ABN , Publish Date - May 28 , 2025 | 06:59 PM

తన తాత నటరత్న యన్టీఆర్ జయంతి సందర్భంగా యంగ్ టైగర్ యన్టీఆర్ ఎప్పటిలాగే ఘాట్ వద్ద ఘననివాళి అర్పించారు. పలు విషయాల్లో తాతను అనుసరించే జూనియర్ యన్టీఆర్ పై అక్కడే అభిమానుల్లో ఓ విషయం చర్చకు వచ్చింది. నిస్సందేహంగా అది ఫ్యాన్స్ కు ఆనందం పంచే అంశమే అని చెప్పాలి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్టీఆర్ (NTR) ను తలచుకోగానే అనేకాంశాలు అభిమానుల మదిలో మెదలుతూ ఉంటాయి. అంతే కాదు, ఆయన నటవారసులు సైతం అదే తీరున సాగితే చూడాలనీ ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. మే 28వ తేదీన యన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవళ్ళు కళ్యాణ్ రామ్ (Kalyan Ram), జూనియర్ యన్టీఆర్ (Jr NTR) ఘాట్ వద్ద తాతకు ఘననివాళి అర్పించారు. అది ప్రతియేటా కనిపించే దృశ్యమే! అయితే కళ్యాణ్ రామ్, యన్టీఆర్ ను కలసి చూసిన ఫ్యాన్స్ కు వారిద్దరూ తాత బాటలోనే పయనిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ఒకరు నటనిర్మాతగా, మరొకరు నటునిగా తాత పేరు నిలుపుతున్నారనీ ఫ్యాన్స్ ఈ సోదరులను అభినందించారు. యన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ ఇప్పటికే కొన్ని చిత్రాలు నిర్మించి అభిమానులను అలరించారు.

జూనియర్ యన్టీఆర్, ఆయన అన్న కళ్యాణ్ రామ్ ను చూడగానే అభిమానులకు ఓ నాటి యన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గుర్తుకు వచ్చారు. అప్పట్లో యన్టీఆర్ హీరోగా, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు పలు జనరంజకమైన చిత్రాలను నిర్మించారు. ఆ చిత్రాలలో కొన్నిటిని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనూ రూపొందించి నటించారు. తరువాతి రోజుల్లో బాలకృష్ణ (Balakrishna) హీరోగా ఆయన అన్న హరికృష్ణ (Harikrishna) చిత్రాలు తెరకెక్కించారు. వాటిలోనూ పలు సినిమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు యన్టీఆర్ కథానాయకునిగా ఆయన అన్న కళ్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాత యన్టీఆర్ లాగా యన్టీఆర్ జూనియర్ కూడా డైరెక్షన్ వహిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అప్పట్లో యన్టీఆర్ సొంత చిత్రాలలోనే బహు పాత్రలు పోషించి మెప్పించారు. అదే తీరున యంగ్ టైగర్ కూడా తన అన్న నిర్మించిన 'జై లవకుశ' (Jai Lavakusa) లో ట్రిపుల్ రోల్ ధరించి అలరించిన తీరు ఫ్యాన్స్ మరువలేదు.


యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు రూపొందించారు. దర్శకునిగానూ యన్టీఆర్ అరుదైన విజయాలను చవిచూశారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని సాగుతోన్న బాలకృష్ణ సైతం 2004లో 'నర్తనశాల' (Narthanasala) అనే పౌరాణిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని ఆశించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 'నర్తనశాల' వెలుగు చూడలేదు. కానీ, ఆ మధ్య కోవిడ్ ప్యాండమిక్ లో 'నర్తనశాల' కోసం బాలయ్య తెరకెక్కించిన సీన్స్ ను 'పే ఫర్ వ్యూ' గా రిలీజ్ చేశారు. మరి నందమూరి నటవంశం మూడోతరంలో టాప్ స్టార్ గా సాగుతున్న జూనియర్ యన్టీఆర్ సైతం తాతను తలపిస్తున్నారు. అందువల్ల తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా, యన్టీఆర్ డైరెక్షన్ లో మూవీ వస్తే చూడాలని ఘాట్ వద్ద గుమికూడిన ఫ్యాన్స్ లో చర్చ సాగింది. అభిమానుల మాటకు విలువనిచ్చి తాతలాగే యంగ్ టైగర్ కూడా మెగాఫోన్ పడతారేమో చూద్దాం.

Also Read: NTR : ఎన్టీఆర్ జన్మదిన కానుకగా విడుదలైన సంసారం

Also Read: NTR Pic: నాలుగు బొమ్మలు - నాలుగు దశాబ్దాలు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 06:59 PM