NTR Pic: నాలుగు బొమ్మలు - నాలుగు దశాబ్దాలు...

ABN , Publish Date - May 28 , 2025 | 06:41 PM

నటరత్న యన్టీఆర్ (NTR) గతించి దాదాపు మూడు దశాబ్దాలు కావొస్తోంది. అయినా అన్నగా జనం మదిలో గుడి కట్టుకొనే ఉన్నారు యన్టీఆర్. ఆయనపై అభిమానం తెలుగువారిలో రోజురోజుకూ పెరుగుతోందే కానీ తరగడం లేదు. అవనిని వీడి మూడు పదులు దాటినా, నవతరం సైతం యన్టీఆర్ ను స్మరిస్తూ ఉండడం విశేషం!

నటరత్న యన్టీఆర్ (NTR) గతించి దాదాపు మూడు దశాబ్దాలు కావొస్తోంది. అయినా అన్నగా జనం మదిలో గుడి కట్టుకొనే ఉన్నారు యన్టీఆర్. ఆయనపై అభిమానం తెలుగువారిలో రోజురోజుకూ పెరుగుతోందే కానీ తరగడం లేదు. అవనిని వీడి మూడు పదులు దాటినా, నవతరం సైతం యన్టీఆర్ ను స్మరిస్తూ ఉండడం విశేషం! మే 28వ తేదీన నటరత్న యన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా చిత్రకారులు, ఛాయాచిత్రకారులు తమ కళను ప్రదర్శిస్తూ రామారావు బొమ్మలను వెలువరించారు. ఇక మోడరన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ యన్టీఆర్ బొమ్మలను పేర్చి అలరించారు కొందరు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తోనూ యన్టీఆర్ బొమ్మలకు చలనం తీసుకువచ్చి ఆకర్షించారు మరికొందరు. ఇలా పలువురు పలు విధాలా యన్టీఆర్ 102వ జయంతిన తమ కళలను ప్రదర్శించారు. అందులో ఒకటి ఇక్కడ మనం చూస్తున్న చిత్రం- అందులో యన్టీఆర్ ను సూపర్ స్టార్ ను చేసిన చిత్రం 'పాతాళభైరవి' (Pathala Bhairavi) బొమ్మ మొదట ఉంది. ఆ పక్కనే రామారావును శ్రీరామచంద్రుని పాత్రలో జీవించేలా చేసిన 'లవకుశ' (LavaKusa) కనిపిస్తుంది. మళ్ళీ ఇటుగా వస్తే 'పాతాళభైరవి' బొమ్మ కింద యన్టీఆర్ ను మరో కోణంలో ఆవిష్కరించిన 'అడవిరాముడు' (Adavi Ramudu) తళుక్కుమంటుంది. ఈ బొమ్మకు అటు వైపు 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' (Srimadvirat Veerabrahmendra Swamy Charitra) లోని చిత్తరువూ ఆకర్షిస్తుంది. అంతా బాగానే ఉంది. ఈ నాలుగు సినిమాలనే ఈ ఫోటో రూపొందించినవారు ఎంచుకోవడానికీ కారణముంది.


ఆ నాలుగు బొమ్మలు నాలుగు దశాబ్దాలకు ప్రతీక! 50, 60, 70, 80ల ను ఈ బొమ్మలు గుర్తు చేస్తాయి. 1951 మార్చి 15న విడుదలైన 'పాతాళభైరవి' ఆ దశాబ్దానికే హిట్ గా నిలచింది. ఇక 1963 మార్చి 29న జనం ముందు నిలచిన 'లవకుశ' చిత్రం తెలుగువారి రంగుల సినిమాయే కాదు, వజ్రోత్సవం చూసిన ఏకైక పౌరాణిక చిత్రంగా నేటికీ నిలచే ఉంది. 1960లలో అంతటి ఘనవిజయం మరొకటి కానరాదు. ఇక 1977 ఏప్రిల్ 28న విడుదలైన 'అడవిరాముడు' తెలుగు సినిమా ఏరియాలుగా పేరొందిన ఆంధ్ర, సీడెడ్, నైజామ్, వైజాగ్ నాలుగు చోట్ల గోల్డెన్ జూబ్లీ చూసిన ఏకైక సినిమాగా నిలచే ఉంది. ఆ సినిమా స్థాయిలో 1970లలో ఆ రేంజ్ విజయం చూసిన చిత్రమేదీ లేదు. 1984 నవంబర్ 29న విడుదలైన 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' అనూహ్య విజయం సాధించింది. తెలుగునాట కోటిన్నర రూపాయలు ఓపెనింగ్ చూపించిన తొలి చిత్రంగా నిలచింది. 1980లలో ఈ స్థాయి సక్సెస్ లేనే లేదు. ఇలా నాలుగు దశాబ్దాల్లో నాలుగు చెక్కుచెదరని అఖండ విజయాలు ఈ బొమ్మలో కనిపిస్తున్నాయి. అందులోనూ మరో విశేషముంది. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలను కూడా ఈ నాలుగు సినిమాలు ప్రతిబింబించడం గమనార్హం! 'లవకుశ' స్థాయి పౌరాణికం తెలుగునాటనే లేదు. ఇక జానపదాలకు ఓ దిక్సూచిలా నిలచిన చిత్రం 'పాతాళభైరవి'. చారిత్రకాల్లో 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'ను మించిన సినిమా ఈ నాటికీ రాలేదు. సాంఘిక చిత్రాలలో 'అడవిరాముడు' రికార్డులు నేటికీ చెక్కుచెదరక నిలచే ఉండడం విశేషం! ఇన్ని విశేషాలను జోడిస్తూ ఈ చిత్రపటాన్ని రూపొందించిన యన్టీఆర్ అభిమానులను అభినందించకుండా ఉండలేం.

Also Read: NTR Birth Anniversary: ఫిల్మ్ నగర్ లో ఘనంగా వేడుకలు

Also Read: Hari Hara Veera Mallu: చెన్నైలో గీతావిష్కరణ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 06:41 PM