Sobhan Babu’: క్రమ శిక్షణ కలిగిన కథానాయకుడు
ABN, Publish Date - Dec 20 , 2025 | 08:23 PM
నటభూషణ్ శోభన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్, అఖిలభారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నటభూషణ్ శోభన్‌బాబు(Sobhan Babu) కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడు’ చిత్రం 50 (50 Years of soggadu) ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్, అఖిలభారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు చిత్రాల్లో శోభన్‌బాబుతో నటించిన కథానాయికలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘శోభన్‌బాబు గారు ఎన్నో చిత్రాల్లో తన విశిష్ట నటనతో ఆకట్టుకున్నారు. ‘మానవుడు-దానవుడు’ సినిమాలో ఆయన నటన చూస్తే ఆ రెండు పాత్రల్లో నటిస్తోంది ఒక్కరేనా అని అనిపిస్తుంది’ అని అన్నారు.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ ‘శోభన్‌బాబు క్రమ శిక్షణ కలిగిన కథానాయకుడు. నిర్మాత ఎవరైనా బడ్జెట్‌లోనే సినిమా పూర్తయ్యేలా చేసేవారు’ అని చెప్పారు.
గాయని సుశీల మాట్లాడుతూ ‘శోభన్‌బాబు గారి సినిమాల్లో పాడిన పాటలు ఇంకా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి’ అని అన్నారు. రచయిత, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ‘నా స్నేహితుడు కాట్రగడ్డ మురారిని నిర్మాత చేసిన గొప్ప హీరో శోభన్‌బాబు’ అని గుర్తు చేశారు.
నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ ‘1975లో మా సంస్థకు కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా ‘సోగ్గాడు’. ఆయన తన పాత్రలో ఎంతో సహజంగా నటించారు. అందుకే ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది’ అని చెప్పారు.
శోభన్‌బాబు మనవడు డా.సురక్షిత్ మాట్లాడుతూ ‘లెజెండ్స్ ఎప్పుడూ మన హృదయాల్లో ఉంటారనే విషయం ఈ స్వర్ణోత్సవంతో స్పష్టమైంది. తాత గారు సినిమాల్లో ఎంత కష్టపడినా..కుటుంబానికి, ఆయన అభిమానులకు తగినంత సమయం కేటాయించేవారు. మాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారు. అందుకే నేను డాక్టర్ అయ్యాను’ అని పేర్కొన్నారు.
నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ‘శోభన్‌బాబు గారు ఇండస్ట్రీలో ఆర్థిక మంత్రిలా ఉండేవారు. ప్రతి సినిమాను లెక్కవేసుకొని చేసేవారు’ అని చెప్పారు.
నటి జయచిత్ర మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించిన జ్ఞాపకాలు ఇంకా మనుసులో అలానే ఉన్నాయి’ అని అన్నారు.
హీరోయిస్లు జయసుధ, సుమలత, రాధిక శరత్ కుమార్, ప్రభ, రోజా రమణి మాట్లాడుతూ శోభన్‌బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెలే జ్యేష్ట రమేశ్ బాబు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశీ మూవీస్ నరసింహారావు, చైర్మన్ సుధాకర్ బాబు, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.