Tollywood: అందాల భామలకు అచ్చిరాని రీ-ఎంట్రీ

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:56 AM

టాలీవుడ్ లో ఈ యేడాది ఇంతవరకూ ముగ్గురు అందాల ముద్దుగుమ్మల కొన్నేళ్ళ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చారు. భారీ హంగామాతో జరిగిన వీరి రీ-ఎంట్రీ సత్ ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. వారు మరెవరో కాదు... అన్షు, లయ, జెనీలియా.

Old Heroines Re entry

'మన్మథుడు' సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అన్షు (Anshu) ఆ తర్వాత ప్రభాస్ (Prabhas) సరసన 'రాఘవేంద్ర'లో నటించింది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన 'మిస్సమ్మ'లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఆ పైన పెళ్ళి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాల మీద మనసు పుట్టి... 'మజాకా' (Mazaka) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మరోసారి తెలుగులో కెమెరా ముందుకొచ్చింది అన్షు. సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా నటించిన 'మజాకా'లో ఆమె అతని పిన్ని వరస అయ్యే పాత్రను పోషించింది. అంతే సందీప్ కిషన్ తండ్రిగా నటించిన రావు రమేశ్‌ తో జోడీ కట్టిందన్నమాట. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో బోల్లా కొట్టింది. అయితే చిత్రం ఏమంటే... ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణే లభించింది. ఈ సినిమా ప్రచార సమయంలో అన్షు తలకు గాయం కూడా అయ్యింది. అయినా ప్రాధమిక చికిత్స చేసుకుని ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ సినిమా ఫలితం నిరాశాజనకంగా మారడంతో ఆ తర్వాత అన్షు ఇంతవరకూ కొత్త సినిమాలకు కమిట్ కాలేదు.


దాదాపుగా నటి లయ (Laya) పరిస్థితి కూడా ఇదే. అయితే అన్షు కంటే లయకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు... ఉత్తమ నటిగా నంది అవార్డులూ అందుకుంది. పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన తెలుగమ్మాయి లయ, వివాహానంతరం నటనకు గుడ్ బై చెప్పేసింది. అమెరికాలో సిర్థపడింది. భర్త, పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్న లయకు 'తమ్ముడు' (Thammudu) సినిమా రూపంలో ఓ కొత్త ఆఫర్ తలుపు తట్టింది. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పేసింది. అలా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత లయ 'తమ్ముడు'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరో నితిన్ (Nitin) అక్కగా లయ నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా నిర్మించారు. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ కావడంతో విడుదలకు ముందు లయ అగ్రసివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మింది. కానీ ఫలితం తిరగబడింది. 'తమ్ముడు' బాక్సాఫీస్ బరిలో చతికిల పడింది. దాంతో ఆమె ఆ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం లేదు. అయితే నటిగా లయకు ఉన్న గుర్తింపు కారణంగా మరికొన్ని సినిమాలలో ఛాన్స్ దక్కించుకునే ఆస్కారం అయితే ఉంది.


ఇక శుక్రవారం విడుదలైన 'జూనియర్' (Junior) మూవీతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చిన జెనీలియా (Genelia) దీ ఇదే పరిస్థితి. తెలుగుతో పలు చిత్రాలలో నటించి, తనదైన ముద్రను వేసిన జెనీలియా... రితేష్ దేశ్ ముఖ్ తో జరిగిన వివాహం తర్వాత తెలుగులో సినిమాలేవీ చేయలేదు. భర్త, పిల్లల బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే రితీష్‌ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ రంగానికి ఆమె పూర్తి స్థాయిలో దూరం కాలేదు. ఓన్ ప్రొడక్షన్ వ్యవహారాలనూ చూస్తూ వచ్చింది. అడపాదడపా వెబ్ సీరిస్, మరాఠీ సినిమాలు చేసింది. ఇక ఈ యేడాది ఆమీర్ ఖాన్ సరసన 'సితారే జమీన్ పర్' మూవీలో నటించింది. పనిలో పనిగా... తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న 'జూనియర్' మూవీలోనూ నటించింది. 'తమ్ముడు'లో హీరో అక్కగా లయ నటించినట్టే, ఇందులో హీరో కిరిటీ సోదరిగా జెనీలియా ఓ కీలక పాత్ర పోషించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని అందరూ అంటున్నారు. కానీ అక్కా, తమ్ముళ్ళ మధ్య సెంటిమెంట్ సీన్స్ ను పండించడంలో దర్శకుడు రాధాకృష్ణారెడ్డి విఫలమయ్యాడని తెలుస్తోంది. 'జూనియర్' మూవీతో హీరో కిరిటీ డాన్సులు, ఫైట్స్ ఇరగదీశాడనే చెబుతున్నారు. కానీ కథాబలం లేని కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. సినిమా ఫలితాన్ని మరీ ముందుగా అంచనా వేయడం సబబు కాదు గానీ... రీ-ఎంట్రీపై జెనీలియా పెట్టుకున్న ఆశలు పెద్దంత వర్కౌట్ అయ్యేలా కనిపించడంలేదు. అన్షు, లయ మాదిరే జెనీలియా సైతం ప్రమోషన్స్ లో బాగా పాల్గొంది, ఈ సినిమా గురించి గొప్పగా చెప్పింది. కానీ ఈ ముగ్గురికీ రీ-ఎంట్రీస్ చేదు అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. మరి ముంబైలో నివాసం ఉంటున్న జెనిలియా తెలుగులో ఇంకేమైనా ఆఫర్స్ అందుకుంటుందేమో వేచి చూడాలి.

Also Read: Karunanidhi: కరుణానిధి పెద్దకొడుకు, నటుడు ముత్తు ఇకలేరు

Also Read: Kollywood: ఇద్దరు హీరోయిన్లు పెళ్ళిపీటలెక్కనున్నారు

Updated Date - Jul 19 , 2025 | 11:59 AM