2025 Rewind: మూడు చిత్రాలతో మంచి గుర్తింపు...
ABN, Publish Date - Dec 31 , 2025 | 04:10 PM
గీతా ఆర్ట్స్ సంస్థ నుండి ఈ యేడాది మూడు సినిమాలు వచ్చాయి. అందులో 'తండేల్, సింగిల్' మూవీస్ సక్సెస్ కాగా 'ది గర్ల్ ఫ్రెండ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ హిట్ కాలేదు.
ఇటీవల జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) బలపరిచిన ప్రొగ్రెసివ్ ప్యానల్ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ముందు అనుకున్న విధంగానే సీనియర్ నిర్మాత, స్టూడియో అధినేత, ప్రముఖ పంపిణీదారుడు డి. సురేశ్ బాబు (D Suresh Babu) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడయ్యారు. ఇదిలా ఉంటే... ఈ యేడాది తమ గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ పై వచ్చిన చిత్రాల పట్ల ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. నిర్మాత అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ పై 'పుష్ప 2' (Pushpa 2) విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాట తదనంతర పరిణామాలతో కాస్తంత వ్యాకులత చెందారు. ఇప్పటికీ ఆ కేసు చిక్కుముడి వీడలేదు. అలానే 2025 ఆగస్ట్ లో అల్లు అరవింద్ తన తల్లిని కోల్పోయారు. ఇలాంటి విషాదకర సమయంలోనే అల్లు శిరీష్ (Allu Sireesh) నిశ్చితార్థం జరగడంతో ఆ ఇంటి తిరిగి సంతోషకర వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే... గీతా ఆర్ట్స్ పతాకంపై వచ్చిన సినిమాలకు లభించిన ఆదరణ పట్ల ఆ సంస్థ సంతృప్తిని వ్యక్తం చేసింది. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి (Saipallavi) జంటగా నటించిన 'తండేల్' (Thandel) మూవీ ఈ యేడాది ఫిబ్రవరి 7న విడుదలైంది. వంద కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన 'తండేల్' నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో గీతా ఆర్ట్స్ సంస్థకు శుభారంభం జరిగినట్టయ్యింది. ఇక మే 9న వచ్చిన 'సింగిల్' (Single) మూవీ కూడా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా నటించిన ఈ చిత్రం వినోదాల విందును అందించింది. పరిమితమైన బడ్జెట్ తో తీయడంతో ఈ సినిమా లాభాలను అందించింది.
ఇక అల్లు అరవింద్ సమర్పణలో నిర్మితమైన 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girl Friend) మూవీ నవంబర్ 7న విడుదలైంది. రష్మిక మందణ్ణ (Rashmika Mandanna) నాయికగా నటించిన ఈ సినిమా రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెరకెక్కించారు. అయితే ముందు రెండు సినిమాల మాదిరి ఈ సినిమా లాభాలను అందించలేదు. పాజిటివ్ టాక్ వచ్చినా... కమర్షియల్ గా 'ది గర్ల్ ఫ్రెండ్' సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా కంటెంట్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దాంతో ఈ సినిమా తమ బ్యానర్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని గీతా ఆర్ట్స్ అధినేత చెబుతున్నారు. ఈ సందర్భంగా తమ బ్యానర్ లో ఈ యేడాది నటించిన నాగ చైతన్య, సాయిపల్లవి, శ్రీవిష్ణు, రశ్మిక మందణ్ణ తదితరులకు గీతా ఆర్ట్స్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
Also Read: RK Roja: స్టార్ హీరో కొడుకుతో నా కూతురు పెళ్లి.. అతనెవరో నాకైనా చెప్పండి
Also Read: 2025 Rewind: అభిమానులను వదిలేసి అనంత లోకాలకు..