Film Awards: గద్దర్ ఫోటో లేకపోవడంపై విమర్శలు
ABN , Publish Date - Jun 13 , 2025 | 09:18 PM
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఆహ్వానపత్రంపై ఆయన ఫోటో లేకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. కవిత అలాంటి వారు దీనిని తప్పుపడుతున్నారు. అయితే గద్దర్ పై రేవంత్ కు ఉన్న ప్రేమను శంకించాల్సిన పని లేదని కొందరు అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గద్దర్ సినిమా అవార్డులను జూన్ 14న ప్రదానం చేయబోతోంది. 2024కు సంబంధించిన సినిమాలతో పాటుగా, 2014 నుండి 2023 వరకూ విడుదలైన సినిమాలలో మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అందులోని హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు అవార్డులు ఇవ్వబోతోంది. దీనితో పాటు పైడి జయరాజ్ జాతీయ అవార్డును, టి.ఎల్. కాంతారావు స్మారక అవార్డును కొత్తగా ప్రకటించింది. గతంలో నంది అవార్డులతో పాటుగా ఇస్తున్న ఎన్టీఆర్ జాతీయ అవార్డును, రఘుపతి వెంకయ్య అవార్డును, బి.ఎన్. రెడ్డి స్మారక అవార్డు, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులనూ తెలంగాణ ప్రభుత్వం 2024కు ఇవ్వబోతోంది. విశేషం ఏమంటే... సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడాన్ని కొందరు విమర్శించినా, వాటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ముందుకు సాగారు. తన ఆలోచనను ఆచరణలో పెట్టడం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. సినిమా రంగంలోని ప్రముఖులందరిని ఒక త్రాటిపైకి తీసుకొచ్చి దిల్ రాజు ఈ వేడుకను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ సాయంతో కృషి చేస్తున్నారు. అందుకోసం హైటెక్స్ ను అంగరంగ వైభవంగా సిద్థం చేస్తున్నారు.
అయితే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఆహ్వానపత్రిక బయటకు వచ్చిన తర్వాత చాలా మంది పెదవి విరుస్తున్నారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నా... ఆహ్వాన పత్రికలో ఎక్కడా గద్దర్ పేరు కనిపించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ గద్దర్ ను మరోసారి అవమానించిందనే తీరుతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కనీసం అవార్డుల ప్రదానోత్సవం సభలో అయినా ఆయన బొమ్మను పెట్టాలని విన్నవించారు. ప్రభుత్వం ప్రచురించిన ఆహ్వాన పత్రికలోనూ, అవార్డులోనూ గద్దర్ బొమ్మను ఉద్దేశ్యపూర్వకంగానే పెట్టలేదనే వారూ లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులను స్వీకరించడానికి సుముఖంగా ఉన్న సినిమా జనం... గద్దర్ పేరుతో ఆ అవార్డులను ఇవ్వడం పట్ల కినుక వహించారని తెలుస్తోంది. వారి మనోభావాలను సైతం దృష్టిలో పెట్టుకునే గద్దర్ బొమ్మ అవార్డుల ప్రతిమలో లేకుండా రేవంత్ సర్కార్ జాగ్రత్తపడిందని కొందరు అంటున్నారు.
అయితే... గద్దర్ అంటే అత్యంత ప్రేమ ఉన్న రేవంత్ రెడ్డి పనికట్టుకుని ఆయన ఫోటోను పక్కన ఎలా పెడతారనే వారూ లేకపోలేదు. ఇన్విటేషన్ లో గద్దర్ బొమ్మ లేదు తప్పితే... ఆయన ప్రతిమను అవకాశం ఉన్న చోటల్లా వాడుతూనే ఉన్నారని తెలుస్తోంది.
తాజాగా రేవంత్ రెడ్డి సైతం గద్దర్ పై తన ప్రేమను చాటుతూ, తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ గారి పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు - తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం అభినందనీయమని అన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని రేవంత్ రెడ్డి అభినందించారు.
Also Read: Chiranjeevi: 45 యేళ్ళ పున్నమినాగు...
Also Read: Deepika Padukone: దీపికా డిమాండ్.. సపోర్ట్ చేసిన దర్శకుడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి