Raviteja: రవన్నా.. మారాలన్నా.. ఇలా అయితే కష్టం అన్నా

ABN , Publish Date - Nov 05 , 2025 | 07:29 PM

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన తాజా చిత్రం 'మాస్ జాతర (Mass Jathara)' బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం రంజింపచేయలేకపోయింది.

Mass Maharaja Raviteja

Raviteja: మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన తాజా చిత్రం 'మాస్ జాతర (Mass Jathara)' బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం రంజింప చేయలేకపోయింది. అందులో శ్రీలీల(Sreeleela) వంటి యంగ్ సెన్సేషన్ నాయికగా నటించినా - ఎందువల్లో మ్యాజిక్ సాగలేదు... దీంతో రవితేజ ఖాతాలో మరో 'ఫట్టు' పడింది. రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ జోరు చూపించడం కాదు - జనానికి నచ్చే కథలను ఎంచుకోవాలని శ్రేయోభిలాషులు, అభిమానులు సూచిస్తున్నారు. ఎందుకంటే గత పదేళ్ళలో రవితేజ 17 చిత్రాలలో నటిస్తే వాటిలో "రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా" సినిమాలే సక్సెస్ రూటులో సాగాయి... వీటిలోనూ 'ధమాకా' ఒక్కటే వంద కోట్లు చూసింది... ఇక 'వాల్తేరు వీరయ్య' వంటి బంపర్ హిట్ ఉంది కానీ, అందులో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ హీరో- అది మల్టీస్టారర్ కాబట్టి సోలోగా రవితేజకు క్రెడిట్ ఇవ్వలేం... అలా పరవశింప చేసినవి కొన్ని, పరాజయం పాలయినవి ఎన్నో అనే తీరున సాగుతోంది రవితేజ ట్రాక్.


పదేళ్ళ క్రితం అంటే 2015లో తొలుత 'కిక్-2'తో ఓ భారీ ఫట్టు పట్టేశారు రవితేజ. తరువాత వచ్చిన 'బెంగాల్ టైగర్' గాండ్రిపు మొదట్లోనే వినిపించింది, తరువాత చప్పబడింది. 'రాజా ది గ్రేట్'తో యాక్టర్ గానూ మార్కులు కొట్టేసినా తరువాత వరుసగా "టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంథోని, డిస్కోరాజా" వంటి ఫ్లాపులు పలకరించాయి. ఆ తరువాత 'క్రాక్' వచ్చి కాసులు కురిపించింది... ఆ పై "ఖిలాడి, రామారావ్ ఆన్ డ్యూటీ" షరా మామూలే అన్నట్టు పరాజయాన్ని చవిచూశాయి. అప్పుడు వచ్చింది 'ధమాకా'. ఈ సినిమా రవితేజకు బిగ్ హిట్ అనే చెప్పాలి... శ్రీలీల కెరీర్ లో కూడా ఆమె నాయికగా నటించిన చిత్రాల్లో 'ధమాకా'నే గ్రాండ్ సక్సెస్ చూసింది... అందువల్ల రవితేజ, శ్రీలీల జంటగా రూపొందిన 'మాస్ జాతర' కూడా సేమ్ మ్యాజిక్ చేస్తుందని ఆశించారు - కానీ, అలా సాగలేదు.


'ధమాకా' తరువాత వచ్చిన 'వాల్తేరు వీరయ్య'ను మల్టీస్టారర్ అని పక్కన పెడితే, ఆ పై వచ్చిన "రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్" చిత్రాలు వరుస పరాజయాలుగా నిలిచాయి. వాటితో పాటే ఇప్పుడు వచ్చిన 'మాస్ జాతర' కూడా అదే తీరున సాగుతోంది. నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నా, రవితేజ మాత్రం తన రెమ్యూనరేషన్ ఏ మాత్రం తగ్గించుకోవడం లేదట. అంతేకాదు, ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనీ వినిపిస్తోంది.


రవితేజకు డిమాండ్ లేకపోతే ఇంతమంది నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయరు కదా అనీ కొందరంటున్నారు. నిజమే - ఇన్ని ఫ్లాపులు పలకరిస్తున్నా రవితేజతో సాగడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారంటే ఆయనపై వారికి నమ్మకం ఉందనే భావించాలి. ఈ నమ్మకం ప్రేక్షకుల్లోనూ కలిగించినప్పుడే రవితేజ 'మాస్ మహారాజా'లా సాగుతారు. కాబట్టి ఇక ముందైనా రవితేజ పారితోషికం కంటే కథకు ప్రాధాన్యమివ్వాలని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం రవితేజ. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఆ మూవీతో అయినా రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Mithramadali: ఫ్లాప్ అయ్యాక తత్త్వం బోధపడింది...

Jatadhara Release Trailer: బ్రహ్మ సృష్టిలో చీకటి కోణం.. ధన పిశాచి జననం

Updated Date - Nov 05 , 2025 | 07:29 PM