Mithramadali: రీ-ఎడిటింగ్‌తో ఓటీటీకి.. మిత్రమండలి! ఫ్లాప్ అయ్యాక తత్త్వం బోధపడింది
ABN , Publish Date - Nov 05 , 2025 | 07:06 PM
ప్రియదర్శి హీరోగా నటించిన 'మిత్రమండలి' సినిమా నవంబర్ 6 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రీ-ఎడిటింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.
కొందరు దర్శక నిర్మాతలు సినిమా విడుదలకు ముందు ప్రదర్శించే ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెన్స్ తో అలా మాట్లాడుతున్నారా లేకపోతే... జనాలను బోల్తా కొట్టించాలని అలా చేస్తున్నారా? అనేది అర్థం కాదు. అయితే ఇవాళ ప్రేక్షకులకు కూడా తెలివి మీరిపోయారు. నిర్మాతలు ఏం చెప్పినా దాన్ని టేకిట్ గ్రాంట్ గా తీసుకోవడం లేదు. సినిమా టాక్ తెలుసుకుని బాగుందంటేనే థియేటర్లకు వెళుతున్నారు.
ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన సినిమా 'మిత్రమండలి' (Mithramandali). ఆ సినిమాను మిత్రులతో కలిసి బన్నీ వాసు (Bunny Vas) తన సొంత బ్యానర్ పై తీశారు. ఇది కూడా 'జాతి రత్నాలు' (Jathiratnalu) స్థాయిలో విజయం సాధిస్తుందని ప్రగల్భాలు పలికారు. కానీ రిజల్ట్ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దీపావళికి కాస్తంత ముందు వచ్చిన ఈ సినిమా ఆ సీజన్ లో వచ్చిన మిగిలిన సినిమాలతో పోల్చితే చివరి స్థానంలో నిలిచింది. ఇంతకూ విషయం ఏమిటంటే... ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సినిమా పరాజయం పాలైన నేపథ్యంలో దీనిని రీ-ఎడిట్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని కాస్తంత ఫన్నీ వేలో చెబుతూ ఈ చిత్ర కథానాయకుడు ప్రియదర్శి (Priyadarshi) ట్వీట్ చేశాడు. నవంబర్ 6 నుండి ప్రైమ్ వీడియాలో 'మిత్రమండలి' స్ట్రీమింగ్ అవుతోంది. 'మీరు ఇప్పుడు చూడబోయేది బ్రాండ్ న్యూ వర్షన్, ఈసారి మరింత షార్ప్ గా, మరిన్ని నవ్వులను పంచే ప్రయత్నం చేశామ'ని ప్రియదర్శి చెబుతున్నాడు. మరి అతని మాటల్లో నిజమెంత ఉందో తెలియాలంటే... ఓటీటీలో 'మిత్రమండలి'ని చూసేయాల్సిందే!
Also Read: Jatadhara Release Trailer: బ్రహ్మ సృష్టిలో చీకటి కోణం.. ధన పిశాచి జననం
Also Read: Action King Arjun: మఫ్టీపోలీస్ వచ్చేస్తున్నాడు...