Karthik Raju: ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దీర్ఘాయుష్మాన్ భవ

ABN , Publish Date - Jul 07 , 2025 | 06:58 PM

కార్తీక్‌ రాజు, నోయల్, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం. పూర్ణానంద్ దర్శకత్వంలో వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'దీర్ఘాయుష్మాన్ భవ'. ఈ నెల 11న మూవీ విడుదల కాబోతున్న సందర్భంగా ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న 'దీర్ఘాయుష్మాన్ భవ' (Dheergayushman Bahava) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ ప్రోమోస్, పాటలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్ (K.L. Damodara Prasad), ఓ. కళ్యాణ్, జబర్దస్త్ ఆర్పీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, 'కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు కనీసం ఒక ఏడాది పాటు ఈ రంగంపై అవగాహన పెంచుకుని వస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి మేం ఛాంబర్ తరఫున, నిర్మాతల మండలి తరఫున కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ లో ఈ సినిమా తీసినట్టు అర్థమౌతోంది. తప్పకుండా ఇది మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


నట్టికుమార్ (Natti Kumar) మాట్లాడుతూ, 'ఈ సినిమాను నట్టీస్ ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ తరఫున్ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, ప్రభుత్వాలు పూనుకోవాలి. చిన్న సినిమాలకు మాట్నీ షో ను కేటాయించాలని ఎప్పటి నుండో కోరుతున్నాం. అలానే మల్టీప్లెక్స్ లో 20 శాతం ఆక్యుపెన్సీకి రూ. 75 రూపాయల టిక్కెట్ పెట్టాలని అడుగుతున్నాం. అప్పుడే ఫ్యామిలీతో మల్టీప్లెక్స్ కు వెళ్ళగలరు' అని అన్నారు. ఈ సినిమాను నట్టికుమార్ విడుదల చేయడం సంతోషంగా ఉందని జబర్దస్ ఆర్.పి. తెలిపారు. ఇది అన్ని ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ ప్యాక్ మూవీ అని నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ చెప్పారు. ఇది ప్రేక్షకులు కోరుకునే వినోదంతో పాటు వారిని అలరించే సోషియో ఫాంటసీ కథాంశముందని దర్శకుడు పూర్ణానంద్ అన్నారు. నటుడు జెమినీ సురేశ్, గీత రచయిత రాంబాబు గోసాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమని, కాశీ విశ్వనాథ్‌, పృథ్వీరాజ్, సత్యం రాజేశ్‌, గెటప్ శ్రీను, తాగుబోతు రమేశ్‌, నోయల్, గుండు సుదర్శన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Also Read: Rashmika Mandanna: వాళ్ళు నన్ను దేనికి పిలవడం లేదు.. బాధగా ఉంది

Also Read: Thabitha : సుకుమార్ భార్యకు అరుదైన గౌరవం

Updated Date - Jul 07 , 2025 | 06:58 PM