Greate Poet Daasaradhi: దాశరథి శతజయంతి

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:28 PM

దాశరథి కృష్ణమాచార్య - ఈ పేరు వింటేనే మదిలో వీణలు మ్రోగుతాయి. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ.' అన్న దాశరథి బాణీ గుర్తుకు వస్తుంది. అన్యాయంపై ధిక్కారం ప్రదర్శిస్తూనే - అనుదినం భక్తిభావంతో సాగారు దాశరథి. జూలై 22న దాశరథి శతజయంతి పూర్తి. ఈ సందర్భంగా ఆయన సాహితీ గమనాన్ని తెలుసుకుందాం.

Daasarathi Krishnamacharyulu

నాటి నిజామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన గళం వినిపించిన ధీశాలి, ధైర్యశాలి దాశరథి కృష్ణమాచార్య (Daasarathi Krishnamacharya). 1925 జూలై 22న మహబూబా బాద్ లోని చిన్నగూడురులో జన్మించిన దాశరథి కృష్ణమాచార్య బాల్యంలో ఉర్దూ మీడియమ్ లో చదివినా, మాతృభాష తెలుగుపై మమకారం పెంచుకొని మరీ అభ్యసించారు. సంస్కృతాంగ్ల భాషల్లోనూ పట్టు సాధించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించినా, నాటి ప్రభుత్వ అన్యాయాన్ని సహించలేని దాశరథి మనసు కమ్యూనిజమ్ వైపు సాగింది. ఆ పార్టీ భావాలు నచ్చని దాశరథి బయటకు వచ్చి తన కవిత్వంతోనే ఆ నాటి నిజామ్ పాలనలోని అన్యాయాన్ని వ్యతిరేకించారు. కవిగా తెలుగునేలపై ఎంతో పేరు సంపాదించాక 'విశాలాంధ్ర' స్వప్నాన్ని చూశాకే, సినిమా గీతరచయితగా పరిచయం అయ్యారు. దాశరథి పాట రాసిన తొలి చిత్రం 'ఇద్దరు మిత్రులు' (Iddaru Mitrulu). కానీ, ఆయన పాటతో విడుదలైన మొదటి సినిమా 'వాగ్దానం' (Vagdhanam). ఈ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి.


దాశరథి కృష్ణమాచార్య పేరులోనే 'కృష్ణ' శబ్దం ఉంది. ఆయన మనసులో ఎన్ని అభ్యుదయ భావాలు చిందులు వేసినా, ఆయన రక్తంలో ఇంకిన సంప్రదాయం 'కృష్ణభక్తి'తోనే సాగింది. కృష్ణునిపై పాటలు పలికించడమంటే దాశరథికి ఎంతో ఇష్టం. అలాంటి సన్నివేశాలు లభించిన ప్రతీసారి దాశరథి కలం పరవశిస్తూ కృష్ణ భక్తిభావాన్ని ఒలికించింది. దాశరథి కలం నుండి జాలువారిన అనేక గీతాలు తెలుగువారిని పులకింప చేశాయి. కొన్ని పాటలు ఈ నాటికీ పరమానందం పంచుతూనే ఉండడం విశేషం!. దాశరథి పాటలతో అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్ తెలుగువారిని రంజింప చేశాయి. ఆయన రాసిన భక్తిగీతాలు ఈ నాటికీ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉండడం విశేషం!

దాశరథి సినిమా పాటలే కాదు, ఆయన పలికించిన కవితా సంపుటాలు తెలుగు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులూ లభించాయి. 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు దాశరథి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగానూ ఉన్నారు. తన మాతృభాష తెలుగుకు సదా పట్టం కట్టాలనే అభిలషించేవారు దాశరథి. తాను నేర్చిన ఉర్దూ భాషనూ గౌరవించేవారు.. తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించిన దాశరథి శతజయంతిని ఆయన అభిమానులు జరుపుకొని మరోమారు ఆ మహాకవిని స్మరించుకున్నారు.

Also Read: Fahadh Faasil - Nazriya Nazim: ఫహాద్- నజ్రియా విడాకులు.. ఒక్క ఫొటోతో క్లారిటీ

Also Read: Varun tej 15: ఇది రెండోసారి.. అప్పుడే రెండు పాటలు పూర్తి 

Updated Date - Jul 22 , 2025 | 06:28 PM