CSR Anjaneyulu: విలక్షణమే... సీయస్సార్ కు సలక్షణం...
ABN, Publish Date - Jul 11 , 2025 | 06:11 PM
తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోశారు సీయస్సార్ (CSR).
CSR Anjaneyulu: తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోశారు సీయస్సార్ (CSR). ఆయన పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. 1907 జూలై 11న మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడిలో జన్మించిన సీయస్సార్ చదువుకొనే రోజుల్లోనే నాటకాలు వేశారు. స్కూల్ ఫైనల్ కాగానే కొంతకాలం కో-ఆపరేటివ్ సూపర్ వైజర్ గా పనిచేశారు. కానీ, నాటకాలపైనే దృష్టిని కేంద్రీకరించి ఉద్యోగానికి టాటా చెప్పేశారు. అనతికాలంలోనే రంగస్థలంపై ఆ నాటి మేటి నటులు స్థానం నరసింహారావు, డి.వి.సుబ్బారావు, పారుపల్లి, అద్దంకి వంటి వారి స్థాయిలో పేరు సంపాదించారు సీయస్సార్. తరువాత చిత్రసీమలో అడుగు పెట్టి కీలక పాత్రలు ధరించసాగారు. నటరత్న యన్టీఆర్ (NTR) కంటే ముందు శ్రీకృష్ణ పాత్రలో అలరించిన వారిలో సీయస్సార్ కూడా ఉన్నారు. తెలుగునాట రూపొందిన తొలి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' లో శ్రీనివాసునిగా మెప్పించారు సీయస్సార్. ఘనవిజయం సాధించిన 'ద్రౌపదీ వస్త్రాపహరణము'లో శ్రీకృష్ణ పాత్రలో ఆకట్టుకున్నారు. 'శ్రీకృష్ణతులాభారము, రాధాకృష్ణ' వంటి చిత్రాల్లోనూ శ్రీకృష్ణునిగా మురిపించారు సీయస్సార్. 'పాదుకా పట్టాభిషేకం'లో శ్రీరామునిగా నటించారు. 'తుకారాం'లో టైటిల్ పాత్ర ధరించారు. ఓ పదేళ్ళ పాటు కథానాయకునిగా, ప్రధాన పాత్రల్లో సాగారు సీయస్సార్.
సినిమా తొలి అడుగులు వేసే రోజుల్లో తెలుగు సినిమాలు కూడా ముంబై, కలకత్తాల్లో షూటింగ్ జరుపుకొనేవి. ఎందరో ప్రముఖ తెలుగు నటీనటులు అక్కడకు వెళ్ళి నటించారు. అలా సీయస్సార్ సైతం ముంబై, కలకత్తాల్లో రూపొందిన తెలుగు చిత్రాల్లో అభినయించారు. అక్కడ మన తెలుగు భోజనం దొరికేది కాదు. దాంతో ఇంటిదగ్గరే పప్పుల పొడి, చిట్లంపొడి వంటివి తయారు చేసుకొని, అక్కడ భోజనాల వేళ చపాతీలు, చప్పటి కూరలతో పాటు వాటిని ఉపయోగించుకొని గడిపారు. సీయస్సార్ చూపిన బాటలోనే తరువాత ఎందరో తెలుగువారు ఉత్తరాది సంస్థలు నిర్మించే తెలుగు చిత్రాల్లో నటించడానికి అక్కడకు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ప్రత్యేకంగా నిలువ పచ్చళ్ళు చేసుకు వెళ్ళేవారు. మద్రాసులో మన సినిమాలు షూటింగ్ జరుపుకొనే రోజుల్లోనూ సీయస్సార్ తన పంథాను మార్చుకోలేదు. ఇంటి దగ్గర నుండి తీసుకు వచ్చిన పచ్చళ్ళు, పొడులతో భోజనం చేసేవారు. ఆయన పంథాను గమనించిన సూర్యకాంతం కూడా అదే తీరున సాగారు.
సీయస్సార్ కామెడీ టైమింగ్ కూడా భలేగా ఆకట్టుకొనేది. అప్పటి హాస్యనటుడు, దర్శకుడు కస్తూరి శివరావు (Kasturi Siva Rao) నిర్మాతగా మారి సీయస్సార్ ను 'పరమానందయ్య'గా నటింప చేసి 'పరమానందయ్య శిష్యులు' తీశారు. ఇందులో రాజు పాత్రలో ఏయన్నార్ (ANR) నటించారు. ఈ చిత్రం ఘోర పరాజయం పాలయింది. ఆ పై సీయస్సార్ కేరెక్టర్ రోల్స్ వేయడానికి పూనుకున్నారు. కేవీ రెడ్డి (K V Reddy) 'పాతాళభైరవి'లో మహారాజుగా సీయస్సార్ నటించిన తీరు ఆకట్టుకుంది. ఇక కేవీ రెడ్డి తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ మూవీ 'మాయాబజార్'లో శకుని పాత్రలో తనదైన అభినయం ప్రదర్శించారు సీయస్సార్. "పెళ్ళి చేసి చూడు, దేవదాసు, కన్యాశుల్కం, రోజులు మారాయి, అప్పు చేసి పప్పుకూడు, భలే రాముడు, చిరంజీవులు, ఇల్లరికం" వంటి సాంఘిక చిత్రాల్లోనూ కీలకమైన పాత్రల్లో నటించి తెలుగుప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక "జగదేకవీరుని కథ, సువర్ణసుందరి, మహాకవి కాళిదాసు, భీష్మ" వంటి చిత్రాల్లోనూ సీయస్సార్ అభినయం అలరించింది.
యన్టీఆర్ కు ముందు శ్రీకృష్ణ పాత్రలో అలరించిన వారిలో సీయస్సార్ వైవిధ్యం ప్రదర్శించారు. ఆయన తనదైన నడకతో శ్రీకృష్ణునిగా మెప్పించారు. చిత్రమేమిటంటే యన్టీఆర్ తొలిసారి శ్రీకృష్ణునిగా తెరపై కనిపించిన 'ఇద్దరు పెళ్ళాలు'(1954)లో అసలు కథ సీయస్సార్ కు సంబంధించిందే. అందులో సీయస్సార్ ధరించిన జమీందార్ పాత్రకే ఇద్దరు పెళ్ళాలు ఉంటారు. తరువాత యన్టీఆర్ శ్రీకృష్ణునిగా ఓ డ్రామాలో తళుక్కుమన్న 'సొంతవూరు' (1956)లోనూ సీయస్సార్ కీలక పాత్ర ధరించారు. ఈ రెండు చిత్రాల తరువాతే యన్టీఆర్ పూర్తి స్థాయిలో 'మాయాబజార్' (1957)లో శ్రీకృష్ణునిగా నటించారు. ఈ సినిమా సమయంలో యన్టీఆర్ ను చూసి సీయస్సార్ "రామారావుగారూ... ఇక జైత్రయాత్ర చేయండి..." అంటూ దీవించారు. ఆయన మాట పొల్లు పోలేదు.
యన్టీఆర్, ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలలో కీలక పాత్రలు ధరించిన సీయస్సార్ చివరగా 'బొబ్బిలియుద్ధం' (1964)లో లక్ష్మన్న పాత్రలో కనిపించారు. ఈ చిత్రం విడుదల కాకముందే 1963 అక్టోబర్ 8న సీయస్సార్ కన్నుమూశారు. ఈ నాటికీ ఆ నాటి సినిమా అభిమానులు సీయస్సార్ వాక్చాతుర్యాన్ని తలచుకొని పరవశించి పోతుంటారు.
Anushka Shetty: బాహుబలి రీయూనియన్.. దేవసేన రాకపోవడానికి అదే కారణమా..