Raashii Khanna: విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించడం కోసం కాదు
ABN, Publish Date - Oct 12 , 2025 | 10:27 AM
'వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్. గతంలో నాకో లవ్‌స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది.
'వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్. గతంలో నాకో లవ్‌స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా' అని రాశి ఖన్నా (Raashii Khanna) అన్నారు. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉంది. వచ్చేవారం సిద్దు జొన్నలగడ్డతో నటించిన 'తెలుసు కదా' (Telusu Kada) రిలీజ్ అవుతోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagath singh) సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి ఆమె చెప్పుకొచ్చిన సంగతులివి...
ఆ పుస్తకాలు ఇష్టం...
నేను పుస్తకాల పురుగుని. చదువులో టాపర్. ఇప్పుడు కూడా షూటింగ్‌లో ఖాళీ సమయం దొరికితే పుస్తకం తిరగేస్తుంటా. ప్రయాణాల్లోనూ నా టైంపాస్ పుస్తకాలే. చరిత్ర గురించి చదవడం ఆసక్తి. అది తెలుసుకునే హీరో కార్తీ ఓసారి మొఘలుల చరిత్రకి సంబంధించి పుస్తకం కానుకగా ఇచ్చాడు. బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే కూడా ‘మిడ్‌నైట్ లైబ్రరీ’ పుస్తకం గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘ది ఫౌంటెన్ హెడ్’, ‘ది గర్ల్ హూ ప్లేడ్ విత్ ఫైర్’ పుస్తకాలంటే చాలా ఇష్టం.
‘బాహుబలి’ మిస్...
మొదట్లో చాలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. వాటిలో ‘బాహుబలి’ ఒకటి. అందులో తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను. అయితే నా సుకుమారమైన ముఖం చూసి రాజమౌళిగారు ఆ పాత్రకు అందంతోపాటు, రఫ్‌లుక్ కూడా కావాలన్నారు. పైగా ‘నా స్నేహితుడొకరు లవ్‌స్టోరీ చేస్తున్నారు. అక్కడకు వెళ్లు. ఆ కథ నీకు బాగా నచ్చుతుంది’ అన్నారు. నేను వెళ్లి ఆ నిర్మాతను కలిసి కథ విన్నా. అలా ‘‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యా.
బ్రేకప్‌తో కుంగుబాటు...
వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్. గతంలో నాకో లవ్‌స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్‌గా నిలబడి, కెరీర్‌పై దృష్టి పెట్టా. కుటుంబసభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. వారే నా బలం.
ఫ్యాషన్ మంత్ర
దుస్తుల ఎంపిక నా మూడ్, ఆలోచనల్ని బట్టి ఉంటుంది. అంతేకానీ గుడ్డిగా ట్రెండ్‌ను ఫాలో అవ్వను. సౌకర్యానికే ప్రాధాన్యమిస్తా. పైజామాలను వేసుకోవడానికి ఇష్టపడతా. యాక్సెసరీస్‌తో లుక్‌ను ఎలివేట్ చేయాలనుకుంటా. తెలుపు, నలుపు, బూడిద రంగు దుస్తుల్ని ఎక్కువగా ఇష్టపడతా.
అందుకే సన్నబడ్డా...
కొత్తలో నా శరీరాకృతి గురించి విమర్శలు ఎదుర్కొన్నాను. బొద్దుగా ఉండటంతో చాలామంది ‘గ్యాస్ ట్యాంకర్’ అని పిలిచేవారు. చాలా బాధేసేది. దాంతో సన్నగా మారాలనుకున్నా. ఈ వృత్తికి నాజూకుగా ఉండటం అవసరమని అర్థమైంది. అందుకే సన్న బడ్డా. అంతేకానీ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించడం కోసం మాత్రం కాదు.
అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా
సినిమాలో సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయనిపిస్తే ‘నో’ చెప్పేస్తా. చాలామంది కథానాయికలు కమర్షియల్ హీరోయిన్ అనే ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ గుర్తింపుని నేను కెరీర్ ఆరంభంలోనే సొంతం చేసుకున్నా. ప్రస్తుతం నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతున్నా.
ఇదీ నా కల...
నా ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టు ఉంది. ఇంకో ఇరవయ్యేళ్లైనా నటిస్తూనే ఉంటా. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా. మహేష్‌బాబుతో కలిసి నటించాలనే కల ఎప్పట్నుంచో ఉంది. దర్శకుల్లో సంజయ్‌లీలా భన్సాలీతో పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నా. హీరోయిన్లను తనదైన శైలిలో ప్రత్యేకంగా
చూపించగల సత్తా ఉన్న దర్శకుడాయన.
ఫటాపట్
కో- స్టార్స్ గురించి ఒక్క మాటలో...
విజయ్ దేవరకొండ- చార్మింగ్
ధనుష్- టాలెంటెడ్
నాగచైతన్య- మెచ్యూర్
సిద్ధార్థ్ మల్హోత్రా- డిసిప్లిన్డ్
షాహీద్ కపూర్- ఫ్రెండ్
నితిన్- ఫన్నీ
రామ్ పోతినేని- నాటీ
గోపీచంద్- సపోర్టివ్