Rashi khanna: ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి.. అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే కష్టమే...

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:34 AM

నేను సినిమా రంగానికి వచ్చినప్పుడు నాకు ఏదీ తెలియదు. మనసుకు ఎలా అనిపిస్తే అలా నటించేదాన్ని. ఆ తర్వాత నటనకు కొన్ని టెక్నిక్స్‌ ఉంటాయని తెలిసింది. పుస్తకాలు చదవడం మొదలు పెట్టా.

Rashi Khanna

'నేను సినిమా రంగానికి వచ్చినప్పుడు నాకు ఏదీ తెలియదు. మనసుకు ఎలా అనిపిస్తే అలా నటించేదాన్ని. ఆ తర్వాత నటనకు కొన్ని టెక్నిక్స్‌ ఉంటాయని తెలిసింది. పుస్తకాలు చదవడం మొదలు పెట్టా. వీడియోలు చూసేదాన్ని. ముంబాయిలో నాటక రంగంలో పనిచేశా. ఎప్పటికప్పుడు నేర్చుకోపోతే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది. మనం పాతబడిపోతాం’ అంటున్నారు హీరోయిన్‌ రాశీఖన్నా(Rashi Khanna). ప్రస్తుతం తెలుగులో 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustaad Bhagath singh) , 'తెలుసు కదా' (Telusu kada) చిత్రాలతో బిజీగా ఉంది. 'తెలుసు కదా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

తెలుగు వచ్చేసింది..

కొంతగ్యాప్‌ తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా 'తెలుసు కదా’. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.  నాకు హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. వచ్చిపోతూ ఉంటాను. ఇక్కడ షూటింగ్‌ జరుగుతూ ఉంటే పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తోంది. తెలుసు కదా సినిమా టీజర్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది, ఇక తెలుగు భాషపై పట్టు రావడానికి కారణం.. చాలాకాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా కదా! తెలుగు వచ్చేసింది. తెలుగే కాదు.. తమిళం, హిందీ కూడా బాగా వచ్చు. ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్‌ కావటానికి భాష చాలా ముఖ్యం. అంతేకాదు... ఇది ఆయా భాష ప్రేక్షకులకు ఇచ్చే కనీస గౌరవంగా భావిస్తా.  


Raashikhanna.jpg
అదే తేడా..
టాలీవుడ్‌లో హీరోయిన్లకు చాలా గౌరవం  ఎక్కువ. ఆదరణ కూడా ఎక్కువ. వర్క్‌ అట్మాస్పియర్‌ బావుంటుంది. పైగా కాల్షీట్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకానే ఉంటుంది. బాలీవుడ్‌, తమిళ పరిశ్రమలో కాల్షీట్‌ పన్నెండు గంటలు ఉంటుంది. అందువల్ల ఎక్కువగా అలసిపోతాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు నా పట్ల అభిమానం ఎక్కువ. నేను ఇతర భాషల్లో చేసిన సినిమాలను కూడా వారు ఆదరిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

అలాంటిదేమీ లేదు.
బాలీవుడ్‌లో దక్షిణాది నటీనటులను తక్కువగా చూస్తారా అని చాలామంది అడుగుతారు. కానీ నాకు అలాంటి ఫీలింగ్‌ ఎప్పుడూ రాలేదు. అంతేకాదు, ఓటీటీ వచ్చిన తరువాత  భాషపరమైన సమస్యలు తొలగిపోయాయి. ఇక్కడ హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నారు. అక్కడ దక్షిణాది సినిమాలు చూస్తున్నారు. ఓటీటీలు వచ్చిన తర్వాత మంచి నటులకు అన్ని భాషల్లోనూ అవకాశాలొస్తున్నాయి.  

Raashi-2.jpg
అప్రమత్తంగా ఉంటా.. లేకపోతే..
కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా. నా పాత్ర, ఎలా ఉందనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెడతా! కొన్నిసార్లు డైరక్టర్లు వచ్చి కథలు చెబుతారు. వాళ్ల దగ్గర స్ర్కిప్ట్‌ ఉండదు. అలాంటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తా. కొందరు డైరక్టర్లకు మంచి దార్శనికత ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. వారు చెప్పినట్లు చేసేస్తాను. కొందరు సలహాలు అడుగుతారు. నాకు తెలిసింది చెబుతా. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. వెబ్‌ సిరీస్‌ పాత్రల్లో అనేక కోణాలు ఉంటాయి. వాటిని చూపించటానికి ఎక్కువ సమయం ఉంటుంది. సినిమాల్లో అంత సమయం దొరకదు. అయితే నాకు సినిమాలంటేనే ఇష్టం. నాకు హారర్‌ జానర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. దానితోపాటు మైథాలజీ, యాక్షన్‌ సినిమాలు కూడా చేయాలని కోరిక. 

Updated Date - Oct 05 , 2025 | 07:29 PM