Tollywood: 2026 వేసవిలో రాబోతున్న.. మెగా ఫ్యామిలీ స్టార్స్
ABN, Publish Date - Oct 09 , 2025 | 06:11 PM
మెగా ఫ్యామిలీ లో టాప్ స్టార్స్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అనే చెప్పాలి... ఈ ముగ్గురి సినిమాలు ఒకే సీజన్ లో రాబోవడం విశేషంగా మారింది... ఎందుకలాగ?
మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు వస్తున్నాయంటే, వారి కుటుంబం నుండి మరో స్టార్ మూవీ బరిలో దూకకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎన్నోసార్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మూవీస్ ఏ మాత్రం క్లాష్ కాకుండా ప్లాన్ చేసుకొని మరీ రిలీజ్ చేసుకున్నారు. అదే తీరున వారి నటవారసుడు రామ్ చరణ్ కూడా సాగారు. అయితే రాబోయే సమ్మర్ లో మాత్రం మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ముగ్గురూ బరిలో దూకే ప్రయత్నంలో ఉన్నారట. అదే నేడు విశేషంగా మారింది. వేసవి అంటే మార్చి ద్వితీయార్ధం నుండి జూన్ ప్రథమార్ధం దాకా ఉంటుంది. అందువల్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రాబోయే చిత్రాలు ఈ సీజన్ లో సరైన తేదీల్లోనే వస్తాయని వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న 'పెద్ది' సినిమా 2026 మార్చి 27న రిలీజ్ కానుంది. కాబట్టి ఆ సినిమాకు తగిన గ్యాప్ తోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు.
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వంభర'కు మొదట్లో విశేషమైన క్రేజ్ ఉండేది. నిజానికి ఈ సినిమాను 2025 సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని భావించారు. అయితే అప్పట్లో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కోసం తాము తప్పుకుంటున్నట్టు చెప్పి 'విశ్వంభర' పోస్ట్ పోన్ అయింది. అప్పటి నుంచీ అది వాయిదాలు పడుతూ సాగుతూనే ఉంది. ఈ సినిమా ఏప్రిల్ లో వస్తుందని అంటున్నారు. అయితే ఏప్రిల్ 15వ తేదీన పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ కానుందని విశేషంగా వినిపిస్తోంది. అంటే ఏప్రిల్ నెలలో చిరంజీవి 'విశ్వంభర' విడుదల కాదనీ కొందరు చెబుతున్నారు.
మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమాల మధ్య గ్యాప్ కనీసం నెల రోజులు కాకపోయినా రెండు వారాలయినా ఉండేలా చూసుకుంటారు. అదే రీతిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజయిన రెండు వారాలకు కానీ, తరువాత కానీ చిరంజీవి 'విశ్వంభర' రావచ్చునని టాక్. జనవరిలో చిరంజీవితో అనిల్ రావిపూడి తీస్తోన్న 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా రానుంది. ఆ సినిమా రిలీజయిన తరువాత గ్యాప్ తీసుకొనే 'పెద్ది' వస్తోంది. 'పెద్ది' తరువాత 19 రోజులకు 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. కావున వేసవిలోనే చిరంజీవి 'విశ్వంభర' ఓ మంచి రోజు చూసుకొని జనం ముందు నిలుస్తుందని టాక్. ఏది ఏమైనా రాబోయే వేసవి సీజన్ లో మెగా ఫ్యామిలీ స్టార్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు వరుసగా రావడం వారి అభిమానులకు అమితానందం పంచుతుందని చెప్పవచ్చు.
Also Read: Udhayanidhi: స్టాలిన్ మనవడి సినీ రంగ ప్రవేశం
Also Read: Bison: తెలుగులోనూ వస్తున్న ధృవ్ విక్రమ్ 'బైసన్'