Bison: తెలుగులోనూ వస్తున్న ధృవ్‌ విక్రమ్ 'బైసన్'

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:32 PM

ధృవ్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'బైసన్' తెలుగులోనూ విడుదల కాబోతోంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'బైసన్' మూవీని ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించాడు.

Dhruv Vikram

విక్రమ్ తనయుడు ధృవ్ (Dhruv) కెరీర్ తెలుగు రీమేక్ 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) తో జరిగింది. చిత్రం ఏమంటే... ఆ సినిమాను ధృవ్ తో రెండు సార్లు నిర్మించారు. మొదట బాల (Bala) 'వర్మ' (Varma) పేరుతో తెరకెక్కించాడు. అది నచ్చకపోవడంతో కొత్త దర్శకుడు గిరీశాయ (Gireesaaya) తో 'ఆదిత్య వర్మ' (Aditya Varma) పేరుతో మరోసారి నిర్మించారు. అయితే... 'ఆదిత్యవర్మ' విడుదలైన తర్వాత సంవత్సరం బాల 'వర్మ' సినిమాను కూడా నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ రెండు సినిమాలూ ధృవ్ కు చేదు అనుభవాన్నే ఇచ్చాయి. ఇక తండ్రి విక్రమ్ (Vikram) తో కలిసి ధృవ్ నటించిన 'మహాన్' (Mahaan) సినిమా సైతం కరోనా కారణంగా ఓటీటీకే పరిమితం అయ్యింది. దాంతో త్వరలో రాబోతున్న 'బైసన్' (Bison) పై ధృవ్ ఆశలు పెట్టుకున్నాడు. తాను నటించిన మొదటి చిత్రం తెలుగు రీమేక్ అని, రెండో సినిమా 'మహాన్' తన తండ్రి మూవీ అని అందువల్ల తన స్ట్రయిట్ ఫస్ట్ మూవీగా 'బైసన్'ను మాత్రమే గుర్తిస్తానని ధృవ్ చెబుతున్నాడు.


తమిళంలో సెన్సిబుల్ మూవీస్ ను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ (Maai Selvaraj) 'బైసన్' మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ దీనిని నిర్మించారు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ డైరెక్టర్. 'బైసన్' మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న విడుదల కాబోతోంది. దీనిని రెండు తెలుగు రాష్ట్రాలలో జగదాంబే ఫిలిమ్స్ బాలాజీ పంపిణీ చేయబోతున్నారు. సినిమా విడుదల ఏదీ దగ్గర పడటంతో తాజాగా ఇందులోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. దీనిని చూస్తుంటే ఇది మత్స్య కారుల జీవితానికి సంబంధించిన కథలా ఉంది. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని మనువాడ బోతోందని తెలిసినప్పుడు ప్రియుడు పడే విరహా వేదన అంతా ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశాడు మారి సెల్వరాజ్. ఈ పాటను తమిళంలో రాసింది కూడా అతనే. తెలుగు వర్షన్ ను ఎ. రామకృష్ణ రాశారు. దీనిని మనువర్థన్ పాడారు. లోతైన సాహిత్యానికి తగ్గట్టే... లోతైన భావాలను హృదయాన్ని పిండేసేలా మను వర్థన్ ఆలపించడం విశేషం. దాదాపు ఏడు నిమిషాల నిడివి ఉన్న సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బైసన్' మూవీలో ఇతర ప్రధాన పాత్రలను పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్‌, అరువి మదన్ తదితరులు పోషించారు.

Updated Date - Oct 09 , 2025 | 05:42 PM