Tollywood: బాణామతి బ్యాక్ డ్రాప్ లో 'చేతబడి'

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:56 PM

క్షుద్ర విద్యలను సైన్స్ కొట్టి పారేస్తుంది. కానీ కొంతమంది మాత్రం దీనిని నమ్ముతూ ఉంటారు. చేతబడి, బాణామతి ద్వారా వ్యక్తులను తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే రాబోతోంది 'చేతబడి' సినిమా.

Chethabadi movie

హారర్ కామెడీలకు తెలుగులో కొదవలేదు. అలానే అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీస్ సైతం జనాలను అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా జనాల మూఢ విశ్వాసాల ఆధారంగా వచ్చే హారర్ మూవీస్ కొన్ని ఉంటాయి. ఆ కోవకు చెందిందే 'చేతబడి' (Chethabadi) మూవీ. శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ (Nanda Kishore) నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సూర్యాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.


కథను గురించి దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ, 'చేతబడి అనేది 16 వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టింది. రెండు దేశాలు కొట్టుకోవాలన్నా, రెండు దేశాలు కలవాలన్నా .. ఒక బలం, బలగం కావాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండానే చంపే విద్యే చేతబడి! అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా భిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల మీద ఈ సినిమా ఆధారపడి ఉంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్ గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశాం. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా లావుగా ఉండేవి. వర్షం పడినా అవి నెలలోకి దిగేవి కావు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది? అనేది ఇందులో చూపించబోతున్నాం' అని చెప్పారు.

నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ, 'ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకున్నారు. ఆ సంఘటనలను ఈ సినిమాలో రియలిస్టిక్ గా చూపించబోతున్నాం' అని అన్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Hreem Movie: సందీప్ కిషన్ క్లాప్ తో...

Also Read: Rashmika Mandanna: ‘కింగ్డమ్‌’ రష్మిక ఎమోషనల్‌ ట్వీట్‌...

Updated Date - Jul 31 , 2025 | 04:04 PM