Chandini Chowdary: 'సంతాన ప్రాప్తిరస్తు' విడుదలకు ముందే కొత్త సినిమా...
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:41 PM
'సంతాన ప్రాప్తిరస్తు' విడుదలకు ముందే చాందినీ చౌదరి నటిస్తున్న మరో సినిమా పట్టాలెక్కింది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది.
'కలర్ ఫోటో' (Color Photo) సినిమాతో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి (Chandini Chowdary). తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది షార్ట్ ఫిల్మ్స్ నుండి వెండితెరపైకి వచ్చింది. కొన్ని సినిమాలలో కీలక పాత్రలలోనూ మెరిసిన చాందినీ చౌదరి ప్రసుత్తం 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా నవంబర్ 14న జనంముందుకు రాబోతోంది. సోమవారం ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే చాందినీ చౌదరి నాయికగా కొత్త సినిమా మొదలైంది. ఆదివారం ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హాజరై క్లాప్ ఇచ్చారు. సుశాంత్ యాష్కీ, చాందనీ చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ మూవీని వికాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. సహచారి క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని సృజన్ గోపాల్ నిర్మిస్తున్నాడు. క్లాప్ కొట్టిన అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 'సహచారి ప్రొడక్షన్ 2 లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ విన్నాను. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అని చెప్పారు.

నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ, 'సహచారి క్రియేషన్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయబోతోంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానెర్లో ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమా కోసం టీం చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. ఎవరు ఊహించని ఒక సూపర్ హీరోని ఇందులో పరిచయం చేస్తున్నాం. ఇందులో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోను త్వరలోనే విడుదల చేస్తాం' అని చెప్పారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలాఖరులో ప్రారంభం కానుంది. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించబోతున్న ఈ సినిమాకు పవన్ సంగీత దర్శకుడు కాగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తారు.
Also Read: 45 The Movie: ఒకే ఫ్రేమ్ లో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి...
Also Read: Tuesday TV Movies: మంగళవారం, Nov 4.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే